వాషింగ్టన్: హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్ దీవులను కొనుగోలు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలంరేపుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన తరహాలోనే, ఇప్పుడు బ్రిటన్‌ను పూర్తిగా పక్కనపెట్టి, చాగోస్ దీవులపై సార్వభౌమాధికారం ఉన్న మారిషస్‌తో అమెరికా నేరుగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక ప్రత్యేక ప్రతిపాదనను ట్రంప్ ముందుకు తెచ్చినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘టెలిగ్రాఫ్’ వెల్లడించింది.
ట్రంప్ వ్యూహం.. బ్రిటన్‌తో సంబంధంలేకుండా..
అమెరికా రూపొందించిన ఈ సరికొత్త ప్రతిపాదన ప్రకారం.. బ్రిటన్‌తో సంబంధం లేకుండా చాగోస్ దీవులను నేరుగా మారిషస్ నుండి కొనుగోలు చేయాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అయితే దీనికంటే ముందు ఆ దీవులకు పూర్తి సార్వభౌమాధికారం లభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పలు ఆప్షన్లలో ఇది ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, అమెరికా అధికారుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు మిత్రదేశంగా ఉన్న మారిషస్‌కు ఈ భూభాగాన్ని పూర్తిగా అప్పగిస్తే, అక్కడ గూఢచర్య ముప్పు పెరిగే అవకాశం ఉందని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డియెగో గార్సియా స్థావరం.. ఇరాన్ ముప్పు
మధ్య హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ చాగోస్ దీవులలోని ‘డియెగో గార్సియా’ సైనిక స్థావరం అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. ప్రస్తుతం ఇరాన్‌తో నడుస్తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ నుండి సుమారు 3,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బేస్ నుండి అమెరికా లాంగ్-రేంజ్ మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత మార్చిలో ఈ సంయుక్త సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించగా, అమెరికా యుద్ధనౌక దాన్ని తిప్పికొట్టింది. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులు చేసేందుకు యూకే ఆలస్యంగా అనుమతి ఇవ్వడంపై ట్రంప్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.
యూకే హ్యాండ్‌ఓవర్ సస్పెన్స్.. శరణార్థుల ఆవేదన
ఈ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్‌కు బదిలీ చేసే ప్రక్రియకు అమెరికా మద్దతు ఉపసంహరించుకోవడంతో, గత ఏప్రిల్‌లోనే దీనికి సంబంధించిన చట్టం నిలిచిపోయింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ.. డియెగో గార్సియాపై నియంత్రణకు ముప్పు పొంచి ఉన్నందున, జాతీయ ప్రయోజనాల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా మద్దతు లేకుండా బ్రిటన్ ఎలాంటి సార్వభౌమత్వ ఒప్పందానికి ముందుకు వెళ్లబోదని స్పష్టం చేశారు. మరోవైపు తమ జన్మభూమి భవిష్యత్తును బ్రిటన్ రాజకీయాలు హైజాక్ చేశాయని, స్వదేశానికి తిరిగి వెళ్లే హక్కు తమకు ఉందని చాగోస్ శరణార్థుల బృందం ఆవేదన వ్యక్తం చేస్తోంది.


