న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తుపాకులు తాత్కాలికంగా శాంతించినప్పటికీ, తెరవెనుక దాయాది దేశం భారత్‌ను దెబ్బతీయడానికి భారీ వ్యూహాన్ని రచిస్తోంది. అంతరిక్షంలో సరికొత్త గూఢచారి ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను నిర్మిస్తూ, భారత్‌పై నిరంతర నిఘా పెడుతోంది. ‘ది ప్రింట్’ పరిశోధనాత్మక కథనం ప్రకారం.. గత 16 నెలల వ్యవధిలోనే (జనవరి 2025 నుండి జూన్ 2026 మధ్య) పాకిస్తాన్ ఏకంగా 6 ఎర్త్-అబ్జర్వేషన్ (భూ-నిఘా) ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలన్నీ భారత భూభాగాన్ని ప్రతి రెండు రోజులకు ఒకసారి క్షుణ్ణంగా మ్యాపింగ్ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనా వెన్నుదన్ను.. అసాధారణ వేగం
పాకిస్తాన్ అంతరిక్ష సంస్థ ‘సుపార్కో’ (SUPARCO) 1961లో ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు కేవలం 15 ఉపగ్రహాలను ప్రయోగిస్తే, అందులో 6 ఉపగ్రహాలను కేవలం ఈ 16 నెలల్లోనే ప్రయోగించడం గమనార్హం. చైనా సాంకేతిక, లాంచ్ మద్దతుతోనే పాక్ ఈ అసాధారణ వేగాన్ని అందుకోగలిగింది. జనవరి 2025లో 'PAUSAT-1', 'PRSC-EO1' ప్రయోగాలతో మొదలైన ఈ సిరీస్, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 'PRSC-EO3' వరకు చేరింది. ఒకప్పుడు నత్తనడకన సాగిన పాక్ స్పేస్ ప్రోగ్రామ్, ఉన్నట్టుండి ఉసేన్ బోల్ట్ వేగంతో దూసుకుపోవడం వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ ఇస్రో అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కశ్మీర్ లక్ష్యంగా ప్రత్యేక కక్ష్య
సాధారణంగా నిఘా ఉపగ్రహాలను సన్-సింక్రోనస్ కక్ష్యల్లో ఉంచుతారు. అయితే, పాకిస్తాన్ ఇటీవల ప్రయోగించిన 'PRSC-EO3' ఉపగ్రహాన్ని అమెరికాకు చెందిన స్పేస్ సంస్థ 'COMSPOC' విశ్లేషించింది. ఇది సాధారణ కక్ష్యలో కాకుండా 38 డిగ్రీల వంపు (Inclined Orbit) ఉన్న ప్రత్యేక కక్ష్యలో తిరుగుతోంది. దీనివల్ల గ్లోబల్ కవరేజ్ తగ్గినప్పటికీ, భారత్, కశ్మీర్ ప్రాంతాలపై ఈ ఉపగ్రహం రోజుకు పలుమార్లు ప్రయాణిస్తూ అత్యంత నిశితమైన నిఘా వేయడానికి వీలవుతుంది. ఈ హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహాల వల్ల భూమిపై ఆర్మీ కదలికలు, దాచి ఉంచిన ఆయుధ సంపత్తిని కూడా పాక్ సులువుగా గుర్తించగలదు.
భారత్‌కు పెరుగుతున్న సవాళ్లు
ఒకవైపు పాకిస్తాన్ అంతరిక్ష నిఘాను పటిష్టం చేసుకుంటుంటే, మరోవైపు గత ఏడాది కాలంలో భారత్ మూడు వ్యూహాత్మక ఉపగ్రహ మిషన్లలో (EOS-N1, EOS-09, NavIC NVS-02) వైఫల్యాలను ఎదుర్కొంది. సరిహద్దుల్లో సైనిక కదలికలు, హిందూ మహాసముద్రంలో నౌకాదళ ఆస్తులను కాపాడుకోవడానికి భారత్ తన సొంత అంతరిక్ష నిఘా సామర్థ్యాన్ని తక్షణమే పెంచుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు.


