ఇలా చేస్తే.. ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు! | How to Book an Entire Train or Coach With Indian Railways Know The Details | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే.. ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు!

Jul 13 2026 8:44 PM | Updated on Jul 13 2026 8:50 PM

How to Book an Entire Train or Coach With Indian Railways Know The Details

పెళ్లి వేడుకలకు, ఆధ్యాత్మిక యాత్రలకు, కార్పొరేట్ టూర్లు లేదా పెద్ద కుటుంబాలతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఇండియన్ రైల్వే ఒక ప్రత్యేకమైన సౌకర్యం అందిస్తోంది. ఫుల్ టారిఫ్ రేట్ (FTR) స్కీమ్ ద్వారా ప్రయాణికులు ఒక రైల్వే కోచ్‌ను లేదా అవసరమైతే పూర్తి రైలునే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువమందితో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఈ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే.. జర్నీ చేయాల్సిన తేదీకంటే ఆరు నెలల ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్ సేవను.. ప్రయోగాత్మకంగా వెస్ట్రన్ రైల్వే పరిధిలో ప్రారంభమయ్యే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. బుకింగ్‌ను IRCTC FTR పోర్టల్ ద్వారా లేదా ప్రయాణం ప్రారంభమయ్యే స్టేషన్‌లోని చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్ (CBS) లేదా స్టేషన్ మాస్టర్‌కు దరఖాస్తు చేసి చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో బుక్ చేయాలంటే.. ముందుగా ప్రయాణ వివరాలు, మార్గం, బుకింగ్ రకం వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు వస్తాయి. ఈ మొత్తాన్ని దరఖాస్తు చేసిన రోజుతో కలిపి ఆరు రోజుల్లోగా చెల్లించాలి. నిర్ణీత గడువులో చెల్లించకపోతే దరఖాస్తు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్ బుకింగ్ కోసం ముందుగా.. స్టేషన్ మాస్టర్ లేదా చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. అధికారులు వివరాలను నమోదు చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ తరువాత యూటీఎస్ కౌంటర్‌లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే ఎఫ్టీఆర్ నెంబర్ జారీ చేసి బుకింగ్‌ను పూర్తి చేస్తారు.

ఈ స్కీమ్ కింద ఒక టూర్ ప్రోగ్రామ్‌కు సాధారణ రైలులో గరిష్టంగా 10 కోచ్‌ల వరకు రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా స్పెషల్ ట్రైన్ బుక్ చేయాలనుకుంటే గరిష్టంగా 24 కోచ్‌ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రెండు సీటింగ్ కమ్ లగేజ్ కోచ్‌లు కూడా ఉంటాయి.

రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే.. ఒక కోచ్‌ను ఏడు రోజుల వరకు బుక్ చేయడానికి రూ.50,000 చెల్లించాలి. ప్రయాణం ఏడు రోజుల కంటే ఎక్కువ ఉంటే అదనంగా ప్రతి కోచ్‌కు రోజుకు రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి రైలును బుక్ చేయాలంటే కనీస రిజిస్ట్రేషన్ మొత్తం రూ.9 లక్షలు. ఇది కనీసం 18 కోచ్‌ల ఆధారంగా లెక్కిస్తారు. 18 కంటే ఎక్కువ కోచ్‌లు ఉంటే ప్రతి అదనపు కోచ్‌కు రూ.50,000 చెల్లించాలి.

ఒకవేళ ప్రయాణికుడు లేదా రైల్వే శాఖ బుకింగ్‌ను రద్దు చేసినా, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. చీఫ్ కమర్షియల్ మేనేజర్ కార్యాలయం ద్వారా రీఫండ్ ప్రక్రియ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement