డిజిటల్ అన్‌రిజర్వ్డ్ టికెట్లను ఉపయోగించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. రైల్ వన్ (Rail One) యాప్ ద్వారా బుక్ చేసిన అన్‌రిజర్వ్డ్ టికెట్‌లను.. టికెట్ తనిఖీ సమయంలో తప్పనిసరిగా అదే యాప్‌లో ఒరిజినల్ రూపంలో చూపించాలని వెల్లడించింది.
టికెట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్, ఫొటో, పీడీఎఫ్ కాపీ లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన కాపీలు చెల్లుబాటు కావని రైల్వే అధికారులు తెలిపారు. డిజిటల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇండియన్ రైల్వే ఈ సూచనలు చేయడానికి కారణం ఇటీవల కోర్బా-విశాఖపట్నం లింక్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకున్న ఘటనే. కోర్బా నుంచి రాయ్‌పూర్‌కు ప్రయాణిస్తున్న ఓ మహిళ తన టికెట్‌ను వాట్సాప్‌లో వచ్చిన స్క్రీన్‌షాట్ రూపంలో టికెట్ తనిఖీ అధికారికి చూపించారు. అయితే ఆ టికెట్‌ను ఆమె సోదరుడు రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసి, స్క్రీన్‌షాట్‌ను ఆమెకు పంపినట్లు తెలిసింది. అయితే.. విచారణలో టికెట్ రైలు బయలుదేరిన తర్వాత బుక్ చేసినట్లు, అలాగే అది ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో లేకపోవడంతో అధికారులు దానిని చెల్లని టికెట్‌గా ప్రకటించి నిబంధనల ప్రకారం జరిమానా విధించారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిజిటల్ అన్‌రిజర్వ్డ్ టికెట్ చెల్లుబాటు కావాలంటే, దానిని బుక్ చేసిన అదే మొబైల్ ఫోన్‌లో, అదే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌లోని రైల్ వన్ యాప్‌లో అందుబాటులో ఉండాలి. ఇతరులకు పంపిన కాపీలు లేదా స్క్రీన్‌షాట్‌లు ప్రయాణానికి పనికిరావు.
అంతే కాకుండా.. అన్‌రిజర్వ్డ్ డిజిటల్ టికెట్‌ను రైలు బయలుదేరే ముందే బుక్ చేయాలని రైల్వేలు స్పష్టం చేశాయి. రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత తీసుకున్న టికెట్, యాప్‌లో కనిపించినా కూడా చెల్లదని పేర్కొన్నాయి. కాబట్టి ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన మొబైల్ ఫోన్‌ను ప్రయాణ సమయంలో తమ వెంట ఉంచుకోవాలని, ఫోన్‌లో తగినంత ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి.


