ఏఐ రంగంలో.. టెక్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం ఏఐ రంగంలో అగ్రస్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో ప్రముఖ ఏఐ మోడళ్ల పనితీరుపై జరిగిన చర్చపై మస్క్ స్పందించారు. ''ఆంత్రోపిక్ గురించి నేను గతంలో చేసిన అంచనా తప్పు. ప్రస్తుతం ఏఐ రంగంలో వారే ముందున్నారు. వారి మిథోస్/ఫేబుల్ (Mythos/Fable) మోడల్ స్థాయికి సమానమైన మోడల్‌ను ఇప్పటివరకు ఏ కంపెనీ విడుదల చేయలేదు. త్వరలోనే వారు మరింత శక్తివంతమైన మిథోస్ 2ను కూడా తీసుకురానున్నారు'' అని పేర్కొన్నారు.
ఆంత్రోపిక్ ప్రస్తుతం ప్రపంచంలో ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం రూపొందించిన క్లాడ్ మోడళ్లు మంచి గుర్తింపు పొందాయి. గత ఏడాది విడుదలైన క్లాడ్ ఓపస్ 4.5 మోడల్ కోడింగ్ సామర్థ్యాల్లో అద్భుతమైన ఫలితాలను చూపడంతో ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు, ఏఐ పరిశోధకులు దీనిని విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో ఓపెన్ఏఐ, గూగుల్, ఎక్స్ఏఐ వంటి దిగ్గజ సంస్థలకు ఆంత్రోపిక్ గట్టి పోటీగా నిలిచింది.
ఎలాన్ మస్క్ వంటి ప్రముఖ వ్యాపారవేత్త ప్రత్యర్థి సంస్థను బహిరంగంగా ప్రశంసించడం ఆంత్రోపిక్ సాధించిన విజయానికి నిదర్శనం. ఏఐ రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతున్న ఈ సమయంలో.. కొత్త ఆవిష్కరణలు, శక్తివంతమైన మోడళ్లతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందే అవకాశాలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
I was clearly wrong about Anthropic. They are obviously currently the leader in AI. No company has released a model as good as Mythos/Fable and they will undoubtedly have Mythos 2 ready soon.
And I would never cut them off in a way that hurt them badly, even as a competitor.…— Elon Musk (@elonmusk) July 9, 2026


