స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఏఐ సెగ! | Ai memory crunch is making phones and laptops costlier and festive deals may disappoint | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఏఐ సెగ!

Jul 8 2026 1:05 AM | Updated on Jul 8 2026 1:06 AM

Ai memory crunch is making phones and laptops costlier and festive deals may disappoint

డిస్కౌంట్ల కోత.. రేట్ల వాత.. 

ఏఐ జోరుతో మెమరీ, స్టోరేజ్‌ చిప్‌లకు భారీ కొరత 

దీంతో గ్యాడ్జెట్‌ ధరలకు రెక్కలు... 

పండుగ సీజన్‌లో కస్టమర్లకు నిరాశే... 

భారీ డీల్స్‌ కష్టమంటున్న కంపెనీలు 

అమ్మకాలు పడిపోతాయని ఆందోళన

ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) గురించే చర్చ. ఏఐ ‘విశ్వ’రూపంతో ఉద్యోగాలు ఊడిపోతాయన్న ఆందోళన ఒకెత్తయితే.. శరవేగంగా విస్తరిస్తున్న ఈ టెక్నాలజీ కారణంగా ఎల్రక్టానిక్‌ గ్యాడ్జెట్లకు కూడా గట్టిగానే సెగ తగులుతోంది. మెమరీ, స్టోరేజ్‌ చిప్‌లకు ఏఐ కంపెనీల నుంచి భారీ డిమాండ్‌ కారణంగా కొరత తలెత్తడంతో స్మార్ట్‌ఫోన్లు, మొబైల్స్‌ రేట్లకు రెక్కలొస్తున్నాయి. విడిభాగాల ధరలు ఇప్పట్లో దిగిరావడం కష్టమేనని, దీంతో రానున్న పండుగ సీజన్‌లో డిస్కౌంట్లు పెద్దగా ఉండకపోవచ్చనేది పరిశ్రమ వర్గాల మాట! 
సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

ఎన్విడియా, గూగుల్,  మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ఓపెన్‌ ఏఐ, ఆంత్రోపిక్‌.. ఏఐ డేటా సెంటర్లు, ఇన్‌ఫ్రా అభివృద్ధిలో పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. దీంతో ఒక్కసారిగా మెమరీ చిప్‌లకు అసాధారణ డిమాండ్‌ నెలకొనడంతో వాటి తయారీ సంస్థలు ఏఐ కంపెనీల వెంటపడుతున్నాయి. ఏఐ సర్వర్లలో వాడే చిప్‌లకు అధిక మార్జిన్లు లభిస్తుండటంతో పీసీలు, స్మార్ట్‌ఫోన్లు తదితర కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో వాడే సంప్రదాయ డీర్యామ్, నాండ్‌ ఫ్లాష్‌ డ్రైవ్‌ల సరఫరా తగ్గించేశాయి.

ఈ దెబ్బతో మెమరీ, స్టోరేజ్‌ చిప్‌లకు తీవ్ర కొరత ఏర్పడి వాటి ధరలు ఎగబాకుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్యాడ్జెట్‌ ప్రియులకు షాకిస్తోంది. యాపిల్‌ తాజాగా మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ మోడళ్లపై భారీగా ధరలు పెంచేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కూడా గత కొద్ది నెలలుగా రేట్లు పెంచుకుంటూపోతున్నాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భారత్‌లో సగటున మొబైల్స్‌ రేట్లు 7.9 శాతం పెరిగాయని రీసెర్చ్‌ సంస్థ టెక్‌ఆర్క్‌ వెల్లడించింది.

చౌక ఫోన్లపై తీవ్ర ప్రభావం.. 
స్మార్ట్‌ఫోన్లలో అత్యంత ఖరీదైన విడిభాగాలుగా ఇప్పటివరకు ప్రాసెసర్లు, డిస్‌ప్లే ఉండేవి. ఏఐ దెబ్బతో ఇప్పుడు మెమరీ వాటిని ఆక్రమించిందని, కొన్ని డివైజ్‌లలో అయితే మొత్తం హార్డ్‌వేర్‌ వ్యయంలో సగం దీనిదే ఉంటోందని మొబైల్‌ కంపెనీ నథింగ్‌ కో–పౌండర్, సీఈఓ కార్ల్‌ పీ పేర్కొన్నారు. ‘కస్టమర్లకు ఇప్పుడిప్పుడే మెమరీ సెగ తగులుతోంది. ఫోన్‌ రేట్లు ఇప్పటికే పెరిగాయి.

మరో ఏడాది పాటు ఎగబాకుతూనే ఉంటాయి. గత మోడళ్ల స్థానంలో ఫిబ్రవరి నుంచి మార్కెట్లోకి తెచ్చిన పలు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు రేట్లను 100 డాలర్లకు పైగానే పెంచేశాయి’ అని ఆయన చెప్పారు. భారత్‌ విషయానికొస్తే, రూ.30,000కు పైబడిన ఫోన్‌ ధరలు రూ.7,000కు మించి ఎగబాకాయి. చౌక స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో దీని ఎఫెక్ట్‌ మరీ ఎక్కువగా ఉందని టెక్‌ఆర్క్‌ డేటా వెల్లడించింది. రూ.10,000 లోపు ఫోన్ల సగటు ధర ఈ ఏడాది ఇప్పటిదాకా 17.6% దూసుకెళ్లగా.. రూ.10,000–20,000 సెగ్మెంట్లో పెంపు 13.9%గా ఉంది. ఇక రూ.20,000–30,000 విభాగంలో 5.6 శాతం పెరుగుదల నమోదైంది.

ల్యాప్‌టాప్, డెస్‌్కటాప్‌ రేట్లూ పైపైకి..
మెమరీ, స్టోరేజ్‌ చిప్‌ల కొరత ల్యాప్‌టాప్‌ తయారీ కంపెనీలనూ కుదిపేస్తోంది. గత్యంతరం లేక గత నెలలో యాపిల్‌ ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లపై భారం మోపింది. భారత్‌లో పలు మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ల ధరలు 20–42 శాతం మేర ఎగబాకడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ప్రాసెసర్లు, గ్రాఫిక్స్‌ చిప్స్, మెమరీ విడిభాగాలపై అధిక ఖర్చు కారణంగా రాబోయే రోజుల్లో మరిన్ని తయారీ సంస్థలు ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని... దీంతో ఏఐ పీసీలు, ల్యాప్‌టాప్‌ల రేట్లకు మరింతగా రెక్కలొస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఏడాది ల్యాప్‌టాప్‌లతో పాటు డెస్క్‌టాప్‌ల ధరలు సైతం 35 శాతం పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. మరోపక్క, 2025లో పీసీ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవగా.. ఈ ఏడాది ధరాభారంతో సేల్స్‌ 8 శాతం మేర పడిపోవచ్చని ఐడీసీ, కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తున్నాయి. రేట్ల షాక్‌ నేపథ్యంలో ఎంట్రీలెవెల్‌ కొనుగోలుదారులు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు వెనకాడవచ్చని, లేదంటే తక్కువ స్పెసిఫికేషన్‌ డివైజ్‌లకే పరిమితం కావచ్చనేది పరిశ్రమవర్గాల అభిప్రాయం.

పండుగ డిస్కౌంట్లు కట్‌...
పండుగ సీజన్‌ మొదలైందంటే చాలు... ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో గ్యాడ్జెట్లపై బంపర్‌ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్‌చేంజ్‌ బోనస్‌లు, నోకాస్ట్‌ ఈఐఎంలతో కంపెనీలు సందడి చేస్తుంటాయి. కస్టమర్లకు గాలమేస్తాయి. అయితే, మెమరీ, స్టోరేజ్‌ ఇతరత్రా కాంపొనెంట్లపై వ్యయం భారీగా ఎగబాకడంతో.. కంపెనీలు ఈసారి పెద్దగా డిస్కౌంట్లు, ఆఫర్లు ఇచ్చే పరిస్థితి లేదని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అంటోంది.

డిమాండ్‌ పడిపోవడం, అధిక ధరల కారణంగా ఈ పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 9–10 శాతం మేర తగ్గొచ్చని అంచనా వేసింది. పండుగ వ్యూహం ఇంకా ఖరారు కాలేదని, అయితే మెమరీ చిప్‌ల కొరత, ఇతర విడిభాగాల రేట్ల పెరుగుదల కారణంగా ప్రైసింగ్‌ నిర్ణయం కష్టతరంగా మారుతోందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఏఐ ఇన్‌ఫ్రాపై పెట్టుబడుల స్పీడ్‌ ఇలాగే కొనసాగితే, పండుగల తర్వాత కూడా గ్యాడ్జెట్‌ రేట్లు మరింత పెరిగే చాన్స్‌ ఉంటుందని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement