14 ఏళ్లకే పారిశ్రామికవేత్త.. బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్! | 14 Year Old Launches AI Startup In Dubai Opens Office In Burj Khalifa, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

14 ఏళ్లకే పారిశ్రామికవేత్త.. బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్!

Jul 5 2026 4:12 PM | Updated on Jul 5 2026 6:05 PM

14 Year Old Launches AI Startup in Dubai Opens Office in Burj Khalifa

సాధారణంగా చాలామంది 14 ఏళ్ల విద్యార్థులు పాఠశాల చదువుల్లో బిజీగా ఉంటారు. కానీ జైనమ్ జైన్ అనే బాలుడు మాత్రం దుబాయ్‌లో ఏఐ స్టార్టప్‌ను స్థాపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇతడు ప్రారంభించిన మెంగో ఇంజిన్ (Mengo Engine) అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన 'బుర్జ్ ఖలీఫా'లో ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం విశేషం. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గుర్తింపు పొందిన అత్యంత పిన్న వయస్కులైన AI పారిశ్రామికవేత్తల్లో జైనమ్ ఒకరిగా నిలిచాడు.

జైనమ్ జైన్ స్థాపించిన మెంగో ఇంజిన్ సంస్థ.. వ్యాపార సంస్థలకు మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్, సేల్స్ సపోర్ట్, కంటెంట్ తయారీ వంటి పనులను AI సహాయంతో వేగంగా, సమర్థవంతంగా నిర్వహించే సేవలను అందిస్తోంది. తక్కువ వయస్సులోనే సాంకేతిక రంగంలో అడుగుపెట్టి, వ్యాపార సంస్థలకు వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా ఇతడు ప్రత్యేక గుర్తింపు పొందాడు.

జైనమ్‌కు చిన్నప్పటి నుంచే వ్యాపారంపై ఆసక్తి ఉండేది. కేవలం ఆరు సంవత్సరాల వయస్సులో తన తండ్రితో కలిసి ఒక వ్యాపార సమావేశానికి వెళ్లినప్పుడు.. అతనిలో పారిశ్రామికవేత్త కావాలనే ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి చదువుతో పాటు వ్యాపార సమావేశాల్లో పాల్గొనడం, విజయవంతమైన వ్యాపారవేత్తలను కలవడం, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడు.

13 ఏళ్ల వయస్సులో జైనమ్ IGCSE పదో తరగతి సిలబస్‌ను కేవలం 105 రోజుల్లో పూర్తి చేశాడు. కంపెనీ అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో వేగంగా చదవడం, నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. పుస్తకాల ద్వారా నేర్చుకునే విద్యతో పాటు ప్రత్యక్ష అనుభవం కూడా సమానంగా ముఖ్యమని అతను విశ్వసిస్తాడు. ఈ కారణంగానే చాలామంది పారిశ్రామిక వేత్తలను కలుసుకోవడానికి సమయం కేటాయిస్తాడు.

స్టార్టప్ నిర్వహణతో పాటు.. జైనమ్ TEDx వేదికపై ప్రసంగించాడు, అతని పేరుమీద రెండు పేటెంట్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఇతడు ఒక పుస్తకాన్ని రచించాడు. అతని యూట్యూబ్ ఛానెల్‌కు 1.45 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 10 ఏళ్ల వయస్సు నుంచే అతను తనకు తానే 50 రోజుల ఛాలెంజ్ వంటివి నిర్దేశించుకునేవాడు. ఈ సమయంలో 50 పుస్తకాలు చదవడం, 50 వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనడం, భారతదేశంలో సుమారు 6,000 కిలోమీటర్లు ప్రయాణించి వివిధ రంగాల నిపుణులు, వ్యాపారవేత్తలను కలవడం వంటి సవాళ్లను విజయవంతంగా పూర్తి చేశాడు.

భవిష్యత్తులో.. తన సంస్థను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా నిర్మించడమే లక్ష్యమని జైనమ్ చెబుతున్నాడు. విజయానికి వయస్సు అడ్డంకి కాదని, మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, నిరంతర కృషి ఉంటే ఎవరైనా తమ కలలను నిజం చేసుకోవచ్చని అతను నమ్ముతున్నాడు. జైనమ్ జైన్ ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ, చిన్న వయస్సులోనే గొప్ప విజయాలను సాధించవచ్చని నిరూపిస్తోంది.

ఇదీ చదవండి: నెలకు రూ.4 లక్షలు.. ఫ్రీగా థాయ్‌లాండ్ ట్రిప్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement