క్యూ1లో నికర లాభం రూ.13,349 కోట్లు; 4.6 శాతం వృద్ధి
ఆదాయం రూ.72,275 కోట్లు; 14 శాతం పెరుగుదల
షేరుకు రూ. 12 మధ్యంతర డివిడెండ్
ముంబై: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) జోరుతో ఐటీ కంపెనీల వృద్ధికి గండి పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో... దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ మెరుగైన ఆర్థిక ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ.13,349 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ.12,760 కోట్లతో పోలిస్తే లాభం 4.6% పెరిగింది. కాగా, కొన్ని అసాధారణ అంశాలను మినహాయిస్తే, క్యూ1లో లాభం 8.5% వృద్ధితో రూ.13,849 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 14% జంప్ చేసి రూ.72,275 కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 63,437 కోట్లుగా నమోదైంది.
సీక్వెన్షియల్‌గా చూస్తే...
గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి (క్యూ4)లో టీసీఎస్ రూ.13,718 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా ఈ క్యూ1లో లాభం 2.7% తగ్గింది. ఆదాయం 70,698 కోట్ల నుంచి 2.23% వృద్ధి చెందింది.
డివిడెండ్ రూ.12
టీసీఎస్ వాటాదారులకు రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జూలై 15 రికార్డు తేదీగా నిర్ణయించింది. జూలై 31న చెల్లింపు జరుగుతుంది.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు...
→ క్యూ1లో కంపెనీ 9.5 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇందులో ఎస్‌కేఎఫ్‌తో కుదుర్చుకున్న 800 మిలియన్ డాలర్ల ఏఐ ఆధారిత మెగా డీల్ కూడా ఉంది.
→ వార్షికంగా రూ.2.6 బిలియన్ డాలర్ల ఏఐ ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 13.6 శాతం వృద్ధి నమోదైంది.
→ ఆపరేటింగ్ లాభాల మార్జిన్ 24 శాతానికి తగ్గింది. మార్చి క్వార్టర్‌లో ఇది 25.3 శాతంగా ఉంది. కొత్త పెట్టుబడులు, వేతనాల పెంపు దీనికి ప్రధాన కారణం.
→ ఏఐ ఎకోసిస్టమ్‌ను విస్తరించడానికి ఆంత్రోపిక్, మిస్ట్రాల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఎఫ్‌ఓ ఆర్తి సుబ్రమణియన్ వెల్లడించారు.
→ కన్జూమర్ బిజ మినహా అన్ని రంగాల ఆదాయాలు పెరిగాయి. బీఎఫ్‌ఎస్‌ఐ 2.4%, లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ 3.5%, ఎనర్జీ–రిసోర్సెస్–యుటిలిటీస్ 6.9% వృద్ధి చెందాయి.
→ ప్రాంతాల వారీగా చూస్తే, లాటిన్ అమెరికా (–2,1%), యూకే (0.6%) ఆదాయాలు తగ్గాయి. ఉత్తర అమెరికా 2%, యూరప్ 4.3 శాతం, ఆసియా పసిఫిక్ 2.5 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. బీఎస్‌ఎన్‌ఎల్‌తో భారీ డీల్ రద్దయినప్పటికీ, భారత్ నుంచి ఆదాయం 22.9 శాతం ఎగబాకడం విశేషం.
→ క్యూ1లో 9,279 మంది ఉద్యోగులు జతయ్యారు. నాలుగేళ్లలో ఒకే క్వార్టర్లో అత్యధిక నియామకాలు ఇవే కావడం గమనార్హం. దీంతో జూన్ 30 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,798కి చేరింది. ఐటీ సేవల్లో ఉద్యోగుల వలసల రేటు (ఆట్రిషన్) 13.6 శాతంగా నమోదైంది.
టీసీఎస్ షేరు అర శాతం నష్టంతో రూ.2,048 వద్ద క్లోజైంది.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కొంతమంది క్లయింట్లు ప్రాజెక్టులను వాయిదా వేయడంతో క్యూ1లో డిమాండ్ కాస్త మందగించింది. అయితే, ప్రస్తుత క్యూ2లో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. భౌగోళికపరమైన, స్థూల ఆర్థిక ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ.. కంపెనీ వృద్ధి పథంలో కొనసాగుతోందనేందుకు క్యూ1 ఫలితాలే నిదర్శనం. ఏఐ, ఆధునీకరణ, సైబర్ సెక్యూరిటీ, సావరీన్ క్లౌడ్‌తో పాటు ప్లాట్‌ఫామ్ సరళీకరణపై కస్టమర్లు పెట్టుబడుల జోరు పెంచారు. మా పటిష్టమైన కొత్త డీల్స్, ఎకోసిస్టమ్ భాగస్వామ్యాల విస్తరణ, కొత్త క్లయింట్లను జత చేసుకోవడంలో మెరుగుదల వంటివి వృద్ధి నిలదొక్కుకోవడానికి దోహదం చేస్తోంది.
– కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ


