ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం మూడు వారాల క్రితం ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన ఈయన.. ఇప్పుడు ఆ హోదాను కోల్పోయారు. దీనికి కారణం స్పేస్‌ఎక్స్ (SpaceX) షేర్ల ధర భారీగా పడిపోవడమే.
నిజానికి 2026 జూన్ 12న స్పేస్‌ఎక్స్ నాస్‌డాక్‌లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఒక్కో షేర్ ధరను 135 డాలర్లుగా నిర్ణయిస్తే.. లిస్టింగ్ రోజే అది 150 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత కూడా పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన రావడంతో షేర్ ధర మరింత పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 2.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా గణనీయంగా పెరిగి 1.4 ట్రిలియన్ డాలర్లను దాటింది. తద్వారా ఈయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించారు.
అయితే.. మస్క్ ఆనందం మూణ్నాళ్ల ముచ్చట అయింది. జూన్ నెలలో పొందిన ట్రిలియనీర్ హోదా.. జులై ప్రారంభం నాటికి పోయింది. ఎందుకంటే స్పేస్‌ఎక్స్ షేర్లు గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో వందల బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ట్రిలియనీర్ హోదా కోల్పోయినా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మాత్రం మస్క్ కొనసాగుతున్నారు.


