breaking news
trillionaire
-
ట్రిలియనీర్ హోదా కోల్పోయిన మస్క్: ఎందుకంటే?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం మూడు వారాల క్రితం ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన ఈయన.. ఇప్పుడు ఆ హోదాను కోల్పోయారు. దీనికి కారణం స్పేస్ఎక్స్ (SpaceX) షేర్ల ధర భారీగా పడిపోవడమే.నిజానికి 2026 జూన్ 12న స్పేస్ఎక్స్ నాస్డాక్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఒక్కో షేర్ ధరను 135 డాలర్లుగా నిర్ణయిస్తే.. లిస్టింగ్ రోజే అది 150 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత కూడా పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన రావడంతో షేర్ ధర మరింత పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 2.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా గణనీయంగా పెరిగి 1.4 ట్రిలియన్ డాలర్లను దాటింది. తద్వారా ఈయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించారు.అయితే.. మస్క్ ఆనందం మూణ్నాళ్ల ముచ్చట అయింది. జూన్ నెలలో పొందిన ట్రిలియనీర్ హోదా.. జులై ప్రారంభం నాటికి పోయింది. ఎందుకంటే స్పేస్ఎక్స్ షేర్లు గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో వందల బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ట్రిలియనీర్ హోదా కోల్పోయినా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మాత్రం మస్క్ కొనసాగుతున్నారు. -
ప్రపంచ కుబేరుడి విజయ గాథ!
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ తన 55వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ (AI) వంటి రంగాల్లో చూపిన దూరదృష్టి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ సాంకేతిక ప్రపంచాన్ని రూపొందిస్తున్న వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.బాల్యం, విద్యఎలాన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లు, టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1989లో ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీకి చేరినప్పటికీ, కేవలం రెండు రోజుల్లోనే దాన్ని వదులుకుని వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.వ్యాపార ప్రస్థానం ప్రారంభం1995లో తన సోదరుడితో కలిసి 'జిప్2' అనే ఆన్లైన్ సిటీ గైడ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను 1999లో విక్రయించడంతో మస్క్‌కు భారీ ఆర్థిక లాభం వచ్చింది. అయితే ఆ డబ్బును ఖర్చు చేయకుండా మరో వినూత్న ఆలోచనకు పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత 'X.com' అనే ఆన్లైన్ ఆర్థిక సేవల సంస్థను ప్రారంభించారు. తరువాత అది 'కాన్ఫినిటీ' సంస్థతో విలీనం చెంది ప్రపంచ ప్రఖ్యాత 'పేపాల్'గా మారింది. పేపాల్‌ను ఈబే కొనుగోలు చేయడంతో మస్క్‌కు వందల మిలియన్ల డాలర్లు లభించాయి.సాంకేతిక రంగంలో విప్లవాత్మక ప్రయాణంపేపాల్ ద్వారా సంపాదించిన సంపదను మస్క్ కొత్త ఆవిష్కరణల కోసం వినియోగించారు. అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా మార్చాలనే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్‌ను స్థాపించారు. అదే సమయంలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాను ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు. అనంతరం ట్విట్టర్‌ను కొనుగోలు చేసి దానికి 'X'గా పేరు మార్చారు. కృత్రిమ మేధ అభివృద్ధి కోసం xAI సంస్థను కూడా స్థాపించారు.రిస్క్ తీసుకునే ధైర్యమే విజయ రహస్యంఎలాన్ మస్క్ విజయానికి ప్రధాన కారణం కొత్త ఆలోచనలను అమలు చేయడంలో ఆయన చూపిన ధైర్యం. ఇతరులు వెనుకడుగు వేసే పరిస్థితుల్లో కూడా ఆయన భారీ పెట్టుబడులు పెట్టి కొత్త అవకాశాలను సృష్టించారు. అందుకే ఆయన వ్యాపార ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు ఆదర్శంగా తీసుకుంటున్నారు.ఎలాన్ మస్క్ ప్రయాణం విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. రాజకీయ వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, వ్యాపార నిర్ణయాల కారణంగా పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొత్త సాంకేతిక ఆవిష్కరణలపై ఆయన దృష్టి మాత్రం మారలేదు. -
మస్క్ ఎంత ధనవంతుండంటే.. వందేళ్లు తరగని సంపద!
కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అనేది సామెత. కానీ ప్రపంచ అపర కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మస్క్‌కు మాత్రం ఈ సామెత సరిపోదేమో! ఎందుకంటే ఆయన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ స్టాక్మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్లకు అధిపతి) అవతరించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు రాయిటర్స్, ఏపీ, బ్లూమ్‌బర్గ్ నివేదికల ప్రకారం, ఇది ఆధునిక ఆర్థిక చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ క్రమంలో మస్క్ సంపద గురించి విస్తృత చర్చ సాగుతోంది.జూన్ 12, 2026న నాస్డాక్లో "SPCX" టిక్కర్‌తో స్పేస్ఎక్స్ షేర్లు లిస్టయ్యాయి. ఒక్కో షేరు ధర 135 డాలర్లుగా నిర్ణయించగా, ట్రేడింగ్ ప్రారంభంలోనే 150 డాలర్లకు చేరుకుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించడం విశేషం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా నమోదైంది. లిస్టింగ్ అనంతరం స్పేస్ఎక్స్ మార్కెట్ విలువ తొలుత 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ట్రేడింగ్‌లో పెరుగుదలతో 2 ట్రిలియన్ డాలర్లను కూడా అధిగమించింది.స్పేస్ఎక్స్లో మస్క్‌కు ఉన్న భారీ వాటా, అలాగే టెస్లాలోని ఆయన పెట్టుబడులను కలిపి చూస్తే ఆయన నికర విలువ సుమారు 1.1 నుంచి 1.3 ట్రిలియన్ డాలర్ల మధ్యకు చేరిందని అంచనాలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే ఈ సంపద ఎక్కువ భాగం కంపెనీ షేర్ల రూపంలో ఉండే "పేపర్ వెల్త్" మాత్రమే; అది నగదు రూపంలో అందుబాటులో ఉండదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కంపెనీల మార్కెట్ విలువలు మారితే ఈ సంపద కూడా మారే అవకాశం ఉంది.శతాబ్దమైనా చాలదు!ఒక ట్రిలియన్ డాలర్ల పరిమాణాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. గంటకు 10 లక్షల డాలర్లు అంటే ఇప్పుడున్న విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.4 కోట్లు ఖర్చు పెడుతూ వచ్చినా 1 ట్రిలియన్ డాలర్లను పూర్తిగా ఖర్చు చేయడానికి శతాబ్దానికి పైగా సమయం పడుతుంది. అంతటి ఆర్థిక శక్తి ఇప్పుడు ఎలాన్ మస్క్ సొంతం.దేశాల జీడీపీలను మించి..మస్క్ సంపదను దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే దాని విస్తృతి మరింత స్పష్టమవుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని చాలా కొన్ని దేశాల జీడీపీ మాత్రమే ట్రిలియన్ డాలర్లకు మించి ఉంటుంది. అంటే ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మస్క్ వ్యక్తిగత సంపద అధికంగా ఉంటుందన్న మాట.అయితే ఈ అసాధారణ సంపదపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం అసమానతలను పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, మస్క్ అభిమానులు మాత్రం అంతరిక్ష సాంకేతికత, కృత్రిమ మేధస్సు, విద్యుత్ వాహనాల్లో ఆయన చూపిన దూరదృష్టే ఈ విజయానికి కారణమని పేర్కొంటున్నారు.టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విటర్), ఎక్స్ఏఐ వంటి సంస్థల ద్వారా ఆటోమొబైల్, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు రంగాల్లో ప్రభావం చూపుతున్న ఎలాన్ మస్క్, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నారు. -
టెస్లా బాస్‌పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఎలాన్ మస్క్'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మస్క్ విజయాన్ని కేవలం సంపదతో కొలవలేమని, అసలు విజయ రహస్యం ఆయన ఆత్మవిశ్వాసం, పట్టుదలలోనే ఉందని పేర్కొన్నారు.స్పేస్ఎక్స్ లిస్టింగ్‌తో మస్క్ సంపద భారీగా పెరిగి ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈరోజు అందరూ ట్రిలియన్ డాలర్ల మైలురాయి గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు కథ ఏమిటంటే.. ఈ రోజు అసాధ్యం అనుకున్నది రేపు సాధ్యమవుతుందని మస్క్ గట్టిగా విశ్వసిస్తారని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.మస్క్ ప్రస్తుతం టెస్లా, స్టార్‌లింక్ వంటి సంస్థల ద్వారా ప్రపంచ సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన జీవితంలో ఎన్నో కష్టకాలాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా 2018లో మస్క్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని వెల్లడించారు. ఆ సమయంలో చాలామంది విమర్శించినప్పటికీ, ఆనంద్ మహీంద్ర మాత్రం ఆయనకు మద్దతు ప్రకటించారు.అప్పట్లో సోషల్ మీడియా వేదికగా మస్క్‌ను ఉద్దేశించి 'ధైర్యంగా ముందుకు సాగండి. ప్రపంచానికి మీలాంటి స్ఫూర్తిదాయక ఆవిష్కర్తలు అవసరం' అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆ సమయంలో మస్క్ చూపిన సహనం, సంకల్పమే తనను ఎక్కువగా ఆకట్టుకుందని ఆయన గుర్తు చేసుకున్నారు.ఆనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. నిజమైన ఆవిష్కర్తలను వారి విజయ సమయాల్లో కాకుండా కష్టకాలంలో వారు ఎలా నిలబడతారనే అంశం ఆధారంగా అంచనా వేయాలి. ఎలాన్ మస్క్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాలపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగడం వల్లే నేడు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్! -
ట్రిలియనీర్ మస్క్.. ఇల్లు మరీ ఇంత సింపులా?
సాధారణంగా సంపన్నుల ఇళ్లు చాలా విలాసవంతంగా ఉంటాయి. భారీ అంతస్తుల్లో, సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాలను తలపిస్తుంటాయి. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాస భవనం యాంటిలియా (Antilia) గురించి విన్నాం కదా. మరి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్ల సంపద) నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) ఇల్లు ఇంకెంత విలాసవంతంగా ఉంటోందనన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే మస్క్ ఎలాంటి ఇంట్లో నివసిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. జూన్ 12న జరిగిన ‘స్పేస్ఎక్స్’ చారిత్రాత్మక ఐపీఓ (SpaceX IPO success) అనంతరం కంపెనీ విలువ ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకోవడంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా ఒక ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.అయితే ఇంత అపార సంపద ఉన్నప్పటికీ మస్క్ జీవనశైలి మాత్రం సంప్రదాయ బిలియనీర్లకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలోని బోకా చికా సమీపంలో, స్పేస్ఎక్స్ స్టార్‌బేస్ కేంద్రానికి దగ్గరగా ఉన్న సుమారు 400 చదరపు అడుగుల ప్రీఫ్యాబ్రికేటెడ్ చిన్న ఇంటిలోనే (Elon Musk Tiny House) ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఇంటిని మాడ్యులర్ హౌసింగ్ సంస్థ బాక్సబుల్ (Boxabl) రూపొందించింది.చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఇంటిలో లివింగ్ ఏరియా, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. మర్ఫీ బెడ్, బిల్ట్-ఇన్ స్టోరేజ్, శక్తి పొదుపు డిజైన్ వంటి అంశాలు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. మస్క్ గతంలో ఓసారి ఈ ఇంటి గురించి మాట్లాడుతూ “అద్భుతమైనది”గా అభివర్ణించారు.2020 తర్వాత కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన పలు ఆస్తులను విక్రయించిన మస్క్, వ్యక్తిగత ఆస్తుల కంటే తన వ్యాపార లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా స్టార్‌షిప్ రాకెట్ అభివృద్ధి, స్టార్‌లింక్ విస్తరణ, కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు స్టార్‌బేస్‌కు సమీపంలోనే మస్క్ నివసిస్తున్నారు.స్పేస్ఎక్స్ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. షేర్లు మార్కెట్లో జోరుగా లిస్టింగ్ కావడంతో కంపెనీ విలువ రెండు ట్రిలియన్ డాలర్లకు చేరువై, మస్క్ సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్ల స్థాయిని తాకినట్లు అంచనాలు వెలువడ్డాయి.చదవండి: లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే


