ట్రిలియనీర్‌ మస్క్‌.. ఇల్లు మరీ ఇంత సింపులా? | Elon Musk Lives In Tiny 400 Sq Ft Prefab Home Despite Becoming World’s First Trillionaire, More Details Inside | Sakshi
Sakshi News home page

ట్రిలియనీర్‌ మస్క్‌.. ఇల్లు మరీ ఇంత సింపులా?

Jun 13 2026 6:39 PM | Updated on Jun 13 2026 7:45 PM

Elon Musk Tiny House 400 Sq Ft Home First Trillionaire Lifestyle

సాధారణంగా సంపన్నుల ఇళ్లు చాలా విలాసవంతంగా ఉంటాయి. భారీ అంతస్తుల్లో, సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాలను తలపిస్తుంటాయి. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ నివాస భవనం యాంటిలియా (Antilia) గురించి విన్నాం కదా. మరి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్ల సంపద) నిలిచిన టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇల్లు ఇంకెంత విలాసవంతంగా ఉంటోందనన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే మస్క్‌ ఎలాంటి ఇంట్లో నివసిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచిన టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. జూన్‌ 12న జరిగిన ‘స్పేస్‌ఎక్స్‌’ చారిత్రాత్మక ఐపీఓ (SpaceX IPO success) అనంతరం కంపెనీ విలువ ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకోవడంతో మస్క్‌ వ్యక్తిగత సంపద కూడా ఒక ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.

అయితే ఇంత అపార సంపద ఉన్నప్పటికీ మస్క్‌ జీవనశైలి మాత్రం సంప్రదాయ బిలియనీర్లకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలోని బోకా చికా సమీపంలో, స్పేస్‌ఎక్స్‌ స్టార్‌బేస్‌ కేంద్రానికి దగ్గరగా ఉన్న సుమారు 400 చదరపు అడుగుల ప్రీఫ్యాబ్రికేటెడ్‌ చిన్న ఇంటిలోనే (Elon Musk Tiny House) ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఇంటిని మాడ్యులర్‌ హౌసింగ్‌ సంస్థ బాక్సబుల్ (Boxabl) రూపొందించింది.

చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఇంటిలో లివింగ్‌ ఏరియా, బెడ్‌రూమ్‌, కిచెన్‌, బాత్రూమ్‌ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. మర్ఫీ బెడ్‌, బిల్ట్‌-ఇన్‌ స్టోరేజ్‌, శక్తి పొదుపు డిజైన్‌ వంటి అంశాలు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. మస్క్‌ గతంలో ఓసారి ఈ ఇంటి గురించి మాట్లాడుతూ “అద్భుతమైనది”గా అభివర్ణించారు.

2020 తర్వాత కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన పలు ఆస్తులను విక్రయించిన మస్క్‌, వ్యక్తిగత ఆస్తుల కంటే తన వ్యాపార లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా స్టార్‌షిప్‌ రాకెట్‌ అభివృద్ధి, స్టార్‌లింక్‌ విస్తరణ, కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు స్టార్‌బేస్‌కు సమీపంలోనే మస్క్‌ నివసిస్తున్నారు.

స్పేస్‌ఎక్స్‌ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. షేర్లు మార్కెట్లో జోరుగా లిస్టింగ్‌ కావడంతో కంపెనీ విలువ రెండు ట్రిలియన్‌ డాలర్లకు చేరువై, మస్క్‌ సంపద సుమారు 1.1 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని తాకినట్లు అంచనాలు వెలువడ్డాయి.

చ‌ద‌వండి: ల‌క్ష రూపాయ‌ల ఫోన్‌.. ఇప్పుడు స‌గం ధ‌ర‌కే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement