లంచ్‌ బ్రేక్‌లో జెన్‌జీ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసా? | Gen Zs New Office Escape: Crying Napping and Battling Burnout | Sakshi
Sakshi News home page

లంచ్‌ బ్రేక్‌లో జెన్‌జీ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసా?

Jul 30 2026 7:46 AM | Updated on Jul 30 2026 8:54 AM

Gen Zs New Office Escape: Crying Napping and Battling Burnout

ఉద్యోగ ఒత్తిడి యువతపై ఎంత ప్రభావం చూపుతోందో తెలియజేసే ఓ కొత్త ట్రెండ్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) ఉద్యోగులు ఆఫీస్‌ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సాధారణ బ్రేక్‌లకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. లంచ్‌ బ్రేక్‌ సమయంలో బయటకు వెళ్లి కొంతసేపు ఒంటరిగా గడపడం, నిద్రపోవడం, భావోద్వేగాలను బయటకు వదిలేయడం వంటి పద్ధతులు కొందరు యువ ఉద్యోగుల్లో కనిపిస్తున్నాయి.

అమెరికాలోని కొందరు జెన్‌జీ ఉద్యోగులు ఆఫీస్‌ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు లంచ్‌ సమయంలో బయటకు వెళ్లి ఏకాంత ప్రదేశాల్లో సమయం గడుపుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. సినిమా థియేటర్లు, మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌లోని ఫిట్టింగ్‌ రూమ్‌లు వంటి ప్రదేశాలను కొందరు తమ ‘సేఫ్‌ స్పాట్స్‌’గా మార్చుకున్నారని పేర్కొంది.

న్యూయార్క్‌కు చెందిన బెన్‌ శాండర్సన్‌ ఉదంతం దీనికి ఉదాహరణగా మారింది. ఆయన ఓ సినిమా థియేటర్‌లో సుమారు రూ.1,200 (15 డాలర్లు) చెల్లించి టికెట్‌ తీసుకున్నప్పటికీ సినిమా చూడకుండా రిక్లైనర్‌ సీటులో 90 నిమిషాలు నిద్రపోయాడు. ఆ నిద్ర తనకు ఎంతో రిలీఫ్‌ ఇచ్చిందని చెప్పడంతో ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో పలువురు యువ ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆఫీస్‌ నుంచి బయటకు వెళ్లి ఏడ్చిన సందర్భాలు, ఒంటరిగా కూర్చుని మనసు ప్రశాంతం చేసుకున్న సందర్భాలను వెల్లడించారు.

భారత్‌లోనూ పెరుగుతున్న పని ఒత్తిడి
భారత్‌లోనూ జెన్‌జీ ఉద్యోగుల పరిస్థితి కొంత భిన్నంగా లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని ఐటీ కంపెనీలు, బీపీఓలు, స్టార్టప్‌లు, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న యువతలో పని ఒత్తిడి పెరుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆన్‌లైన్‌లో ఉండాల్సిన పరిస్థితి, నిరంతరం వచ్చే మెయిల్స్‌, టార్గెట్లు, పనితీరు సమీక్షలు యువ ఉద్యోగుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. 

కొందరు ఉద్యోగులు లంచ్‌ బ్రేక్‌లో నిద్రపోవడం, వాకింగ్‌కు వెళ్లడం, ఫోన్‌ ఆఫ్‌ చేసి కొంతసేపు ఒంటరిగా ఉండటం వంటి మార్గాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్‌ తర్వాత వర్క్‌ కల్చర్‌లో వచ్చిన మార్పులు కూడా యువతపై ప్రభావం చూపాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి హైబ్రిడ్‌, ఆఫీస్‌ మోడల్‌కు మారిన తర్వాత పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కష్టంగా మారిందని పలువురు చెబుతున్నారు.

ఉద్యోగం మారాలన్న ఆలోచన పెరుగుతోంది
యువ ఉద్యోగుల్లో సంప్రదాయ ఆఫీస్‌ సంస్కృతిపై అసంతృప్తి పెరుగుతోందని పలు సర్వేలు సూచిస్తున్నాయి. ఎక్కువ పని గంటలు, గుర్తింపు లేకపోవడం, మానసిక ఒత్తిడి, సరైన వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ లేకపోవడం వంటి కారణాలతో కొందరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి జెన్‌జీ తరం కేవలం జీతానికే కాకుండా.. పని చేసే వాతావరణం, మానసిక ప్రశాంతత, వ్యక్తిగత జీవితానికి సమయం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది.

AI భయం కూడా మరో కారణం
మరోవైపు కృత్రిమ మేధస్సు (AI) పెరుగుతున్న వినియోగం కూడా యువ ఉద్యోగుల్లో కొత్త ఆందోళనలకు కారణమవుతోంది. కొన్ని ఉద్యోగాలు ఆటోమేషన్‌ వల్ల తగ్గిపోతాయనే భయం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన ఒత్తిడి యువతపై ప్రభావం చూపుతోంది. ఏఐ టూల్స్‌ వేగంగా మారుతున్న నేపథ్యంలో తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న యువ ఉద్యోగులు కూడా ఉన్నారు. అందుకే కొందరు కొత్త టెక్నాలజీలను నేర్చుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరికొందరు ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.

‘బ్రేక్‌ కల్చర్‌’కు పెరుగుతున్న ఆదరణ
పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొద్దిసేపు విరామం తీసుకోవడం ఇప్పుడు జెన్‌జీ ఉద్యోగుల్లో సాధారణంగా మారుతోంది. ఇది కేవలం పని నుంచి తప్పించుకోవడం కాదని.. మానసికంగా తిరిగి శక్తిని పొందేందుకు ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ భద్రతపై భయం, మానసిక అలసట.. ఇవన్నీ కలిసి జెన్‌జీ ఉద్యోగుల్లో కొత్త రకమైన ‘బ్రేక్‌ కల్చర్‌’కు దారితీస్తున్నాయి. ఆఫీస్‌ బయట కొన్ని నిమిషాల ప్రశాంతత కోసం వెతుకుతున్న ఈ తరం.. పని ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement