భారత్‌ జీడీపీకి ఇంధన సెగ | ADB Cuts India GDP Growth Forecast as Rising Fuel Prices West Asia Tensions | Sakshi
Sakshi News home page

భారత్‌ జీడీపీకి ఇంధన సెగ

Jul 10 2026 5:40 AM | Updated on Jul 10 2026 5:44 AM

ADB Cuts India GDP Growth Forecast as Rising Fuel Prices West Asia Tensions

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) 6.6 శాతానికి తగ్గించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధనాల ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, ఆదాయాలపై ప్రభావం చూపనుండటమే ఇందుకు కారణం. ఇది 6.9 శాతంగా ఉండొచ్చని ఏడీబీ ఏప్రిల్‌లో అంచనా వేసింది. వృద్ధి మందగించినా కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్‌ కొనసాగుతుందని పేర్కొంది.

గత అంచనాలకు అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతం మేర విస్తరించే అవకాశం ఉందని వివరించింది. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు విధానపరమైన చర్యలు, ఇంధనాలపై ట్యాక్స్‌ తగ్గించడం, సర్వీసుల ఎగుమతులు పటిష్టంగా ఉండటం తదితర అంశాలు మెరుగైన వృద్ధికి దోహదపడొచ్చని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ ఔట్‌లుక్‌ (ఏడీవో) జూలై నివేదికలో ఏడీబీ పేర్కొంది.

గ్లోబల్‌గా పరిస్థితులు మెరుగుపడటం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు మరింతగా పెరగడం వల్ల 2027 ఆర్థిక సంవత్సరంలో అధిక వృద్ధికి ఊతం లభిస్తుందని వివరించింది. భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వ్యవసాయంపై ప్రతికూల వాతావరణ ప్రభావాల్లాంటి రిసు్కలు పొంచి ఉన్నాయని ఏడీబీ తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కూడా ఇప్పటికే భారత్‌ వృద్ధి అంచనాలను తగ్గించాయి. ఐఎంఎఫ్‌ 6.5 శాతం నుంచి 6.4 శాతానికి, రిజర్వ్‌ బ్యాంక్‌ 6.9 శాతం నుంచి 6.6 శాతానికి కుదించాయి.  

ద్రవ్యోల్బణం అప్‌.. 
భగ్గుమంటున్న ఇంధన ధరలతో రవాణా, ఆహార వ్యయాలు పెరిగిపోవడమనేది ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తోందని ఏడీబీ తెలిపింది. దీనితో 2026–27లో ఇది గతంలో అంచనా వేసిన 4.5 శాతం కన్నా అధికంగా 5.2 శాతానికి ఎగియొచ్చని వివరించింది. అయితే, క్రమంగా ఇంధనం, ఆహార ధరలు సాధారణ స్థితికి తిరిగొచ్చే అవకాశం ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం ద్రవ్యోల్బణం గత అంచనాలకు తగ్గట్లు 4 శాతం స్థాయిలోనే కొనసాగవచ్చని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement