ఐటీ, ఆటో, ఆయిల్ షేర్లలో అమ్మకాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన క్రూడాయిల్ ధరలు
372 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబై: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ అరశాతం నష్టంతో ముగిసింది. ఐటీ, ఆటో, చమురు రంగాల షేర్లలో అమ్మకాలతో పాటు కీలక షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 76,728 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 24,000 స్థాయి దిగువన 23,946 వద్ద నిలిచింది. ఫ్లాటుగా ప్రారంభమైన సూచీలు రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ 50 రీబ్యాలెన్సింగ్, బీఎస్‌ఈ సెన్సెక్స్ నెలవారీ ఎక్స్‌పైరీ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. నేడు నిఫ్టీ వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీలతో పాటు బ్యాంక్ నిఫ్టీ నెలవారీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 478 పాయింట్లు పతనమై 76,622 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు కోల్పోయి 23,925 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.
అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా 1.14%, జపాన్ 0.15%, హాంకాంగ్ 1.5%, తైవాన్ 0.9% పెరిగాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశా యి. అమెరికా సూచీ లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.
ఇండెక్సుల వారీగా: బీఎస్‌ఈలో ఆటో (–2.11%), ఆయిల్ అండ్ గ్యాస్ (–1.40%), సర్వీసెస్ (–1.21%), ఐటీ (–1.04%) రంగాలు పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.65%, 0.60 శాతం నష్టపోయాయి.
పర్సిస్టెంట్ సిస్టమ్స్: జర్మనీకి చెందిన డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ నగారో ఎస్‌ఈని కొనుగోలు చేసుకుంటామని ప్రకటించడంతో పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్‌ఈలో ఈ షేరు 11% నష్టపోయి రూ.4,298 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 11.63% కోల్పోయి రూ.4,277 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ఎండీ, సీఈవోగా అశోక్ వాస్వానీ తమ పునర్నియామకాన్ని కోరడం లేదని స్పష్టం చేయడంతో కోటక్ బ్యాంకు షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో 3.2% నష్టపోయి రూ.396 వద్ద ముగిసింది. ఒక దశలో 3.6% పతనమై రూ.394 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. దీంతో బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.13,177 కోట్లు హరించుకుపోయి రూ. 3.93 లక్షల కోట్లకు దిగివచి్చంది.
టర్టిల్‌మింట్ లిస్టింగ్.. ప్చ్
ఇన్సూరెన్స్ కంపెనీ టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.152)తో పోలిస్తే 10.39% డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 13% క్షీణించి రూ.132 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% నష్టంతో రూ.135 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,987 కోట్లుగా నమోదైంది.


