ఓపెన్‌ఏఐలో కీలక పరిణామం.. ఏజీఐ సీఈఓ రాజీనామా! | OpenAI AGI Deployment Chief Fidji Simo To Step Down After Medical Leave, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ఏఐలో కీలక పరిణామం.. ఏజీఐ సీఈఓ రాజీనామా!

Jul 10 2026 8:36 AM | Updated on Jul 10 2026 10:03 AM

OpenAI AGI Deployment Chief Fidji Simo To Step Down After Medical Leave

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో దూసుకెళ్తున్న ఓపెన్‌ఏఐలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీలో ఏజీఐ (AGI) డిప్లాయ్‌మెంట్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఫిద్జీ సిమో (Fidji Simo) తన పూర్తి స్థాయి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనారోగ్య సమస్యల కారణంగా ఇకపై ఫుల్ టైమ్ పనిచేయడం సాధ్యం కాదని, భవిష్యత్తులో పార్ట్‌టైమ్ అడ్వైజర్‌గా సంస్థకు సేవలందించనున్నట్లు వెల్లడించారు.

ఫిద్జీ సిమో గత ఏడేళ్లుగా ఒక దీర్ఘకాలిక న్యూరో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఆ వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో వైద్యుల సూచన మేరకు ఆమె మెడికల్ లీవ్ తీసుకున్నారు. చికిత్స అనంతరం కోలుకోవడానికి తాను ఊహించిన దానికంటే ఎక్కువ సమయం అవసరమవుతుందని గ్రహించిన ఆమె, ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ (X)లో వెల్లడించారు.

ఫిద్జీ సిమోకు టెక్ రంగంలో విశేష అనుభవం ఉంది. గతంలో ఆమె ఇన్‌స్టాకార్ట్ సీఈఓగా పనిచేయడంతో పాటు, మెటా సంస్థలో ఫేస్‌బుక్ యాప్ విభాగానికి నాయకత్వం వహించారు. 2024లో సామ్ ఆల్ట్‌మన్ మళ్లీ ఓపెన్‌ఏఐ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, కంపెనీ బోర్డులో చేరిన ముగ్గురు కొత్త డైరెక్టర్లలో సిమో కూడా ఒకరు. ఆ తరువాత సంస్థలో కీలక బాధ్యతలు స్వీకరించి ఏజీఐ అభివృద్ధి, వ్యాపార విస్తరణలో ముఖ్య పాత్ర పోషించారు.

సిమో రాజీనామాపై ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ స్పందిస్తూ, ఆమె సంస్థకు అందించిన సేవలు ఎంతో విలువైనవని, ఆమె ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. సంస్థ అభివృద్ధికి ఆమె చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు.

సిమో బాధ్యతలను ఇకపై ఓపెన్‌ఏఐ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సారా ఫ్రియర్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జేసన్ క్వాన్ కలిసి నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే తదుపరి ఏజీఐ ఎవరనే విషయం త్వరలోనే వెల్లడవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement