ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఎవరితోనైనా మాట్లాడాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్‌ను షేర్ చేయాల్సి వచ్చేది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు ఇది చాలా మందికి ప్రైవసీ పరంగా అసౌకర్యంగా అనిపించేది. ఇకపై ఆ సమస్యకు చెక్ పడనుంది.
ఫోన్ నంబర్ కాకుండా యూజర్ Username ద్వారానే ఇతరులతో చాట్ చేసే అవకాశం వాట్సాప్ కల్పించనుంది. ఈ విషయాన్ని సీఈవో కునాల్ షా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. "మీకు నచ్చిన పేరును ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి" అంటూ వినియోగదారులకు సూచించారు. ఈ ఫీచర్‌ను జూన్ 29 నుంచి దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తుండగా.. ఈ ఏడాది చివరినాటికి అందరికీ అందుబాటులోకి రానుంది.
నంబర్ అవసరం లేదు..
కొత్త ఫీచర్‌తో ఇకపై కొత్త వ్యక్తులకు మీ ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఎంచుకున్న ప్రత్యేకమైన పేరును మాత్రమే షేర్ చేస్తే సరిపోతుంది. ఆ Username ద్వారా అవతలి వ్యక్తి మీతో చాట్ ప్రారంభించగలుగుతారు. కాలేజీ స్నేహితులు, ఆఫీస్ పరిచయాలు, వ్యాపార సంబంధాలు, ఈవెంట్లలో కలిసిన వ్యక్తులు లేదా గ్రూప్‌ల్లోని కొత్త సభ్యులతో నంబర్ పంచుకోకుండా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ తెలిపింది.
ప్రైవసీకే పెద్దపీట
ఈ ఫీచర్‌ను సోషల్ మీడియా తరహాలో రూపొందించలేదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్ లేదంటే ఎక్స్ యూజర్‌నేమ్‌ల కోసం పబ్లిక్ సెర్చ్ లేదంటే డైరెక్టరీ ఉండదు. ఎవరైనా మీకు మెసేజ్ పంపాలంటే మీ ఖచ్చితమైన Username వారికి తెలిసి ఉండాలి. దీంతో అనవసర మెసేజ్‌లు, స్పామ్‌లను తగ్గించే అవకాశం ఉంటుంది.
అదనపు భద్రత ఏంటంటే..
యూజర్‌నేమ్‌తో పాటు వాట్సాప్ మరో కొత్త భద్రతా ఫీచర్‌ను కూడా తీసుకొస్తోంది. యూజర్‌నేమ్ కీ(Username Key) పేరుతో వచ్చే ఈ ఆప్షన్‌ను యూజర్లు ఐచ్ఛికంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే.. తొలిసారి మీకు మెసేజ్ పంపాలనుకునే వ్యక్తి యూజర్‌నేమ్‌తో పాటు మీరు సెట్ చేసిన ప్రత్యేక కీను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ కీని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. దీంతో అవాంఛిత వ్యక్తుల నుంచి మరింత రక్షణ లభిస్తుంది.
ఎలా రిజర్వ్ చేసుకోవాలి?
యూజర్‌నేమ్ రిజర్వ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్‌ను అనుసరించండి.
వాట్సాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
సెట్టింగ్స్‌ను Settings ఓపెన్ చేయండి.
అకౌంట్ Accountపై ట్యాప్ చేయండి.
యూజర్‌నేమ్ Username ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీకు అందుబాటులో ఉన్న పేరును ఎంపిక చేసి కన్ఫర్మ్ చేయండి.
అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం దశలవారీగా విడుదల అవుతోంది. కాబట్టి అందరికీ ఒకేసారి కనిపించకపోవచ్చు.
నిబంధనలు
గరిష్ఠంగా 35 అక్షరాలు ఉండవచ్చు.
అవసరమైతే ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదంటే తొలగించుకోవచ్చు.
ప్రముఖులు, సెలబ్రిటీలు, సంస్థలకు సంబంధించిన కొన్ని యూజర్‌నేమ్‌లను వాట్సాప్ ముందుగానే రిజర్వ్ చేస్తుంది. దీంతో నకిలీ ఖాతాలు (Impersonation) సృష్టించే అవకాశాలు తగ్గుతాయి.
వ్యాపార సంస్థలు, క్రియేటర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ లేదంటే ఫేస్‌బుక్ అకౌంట్‌కు అనుగుణంగా Username పొందే అవకాశం కూడా ఉంటుంది.
పాత చాట్లపై ప్రభావం?
ఈ కొత్త ఫీచర్ వచ్చినా ప్రస్తుతం ఉన్న చాట్లు, కాంటాక్ట్‌లు, బ్లాక్, రిపోర్ట్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి సదుపాయాల్లో ఎలాంటి మార్పు ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలా ఉపయోగిస్తున్నారో అలాగే కొనసాగించవచ్చు.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
యూజర్‌నేమ్ రిజర్వేషన్ ఫీచర్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. రాబోయే నెలల్లో దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది. మీ ప్రాంతంలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వాట్సాప్ యాప్‌లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఏడాది చివరినాటికి అన్ని యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.


