కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో | Wipro Onboarding Delay: NITES Approaches Labour Ministry Over 200 Freshers' Offer Letters | Sakshi
Sakshi News home page

కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో

Aug 14 2026 2:05 PM | Updated on Aug 14 2026 2:24 PM

Wipro Onboarding Delay 200 Freshers Offer Letters NITES Labour Ministry Action

ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో ఉద్యోగాల కోసం ఎంపికైన 200 మందికి పైగా విద్యార్థులు, యువ ఇంజనీర్ల ఆన్‌బోర్డింగ్‌ ఆలస్యంపై వివాదం ముదిరింది. ‘ఎలైట్ హైరింగ్ 2025’ కార్యక్రమం కింద ఎంపికైన అభ్యర్థులను నెలల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారంటూ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఆగస్టు 13న కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసిన నైట్స్‌.. ఈ వ్యవహారంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరింది.

ఆఫర్ లెటర్ ఇచ్చినా.. జాయినింగ్ డేట్ లేదు

నైట్స్‌ వివరాల ప్రకారం.. బాధిత అభ్యర్థులు ఫిబ్రవరి 2025లో విప్రో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొని టెక్నికల్, వాయిస్ అసెస్‌మెంట్లను పూర్తి చేశారు. ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం 2025 జూలైలో ఆఫర్ లెటర్లు, ఆగస్టులో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOI) అందుకున్నారు. నిర్ణీత గడువులోనే వాటిని అంగీకరించారు. అయితే ఆ తర్వాత వారి నియామక ప్రక్రియ ముందుకు సాగలేదని సంఘం ఆరోపించింది.

డిసెంబర్ 2025లో అభ్యర్థులు మరోసారి విప్రో నిర్వహించిన సర్వే ద్వారా కంపెనీలో చేరేందుకు తమ ఆసక్తిని ధ్రువీకరించారు. అనంతరం మార్చి 2026లో కోడిలిటీ టెక్నికల్ అసెస్‌మెంట్ నిర్వహించగా, అందులోనూ ఉత్తీర్ణులయ్యారు. మార్చి 24న క్లియరెన్స్ సమాచారం అందిందని నైట్స్‌ పేర్కొంది. మార్చి 25న బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లింక్ అందగా, మార్చి 26న అభ్యర్థులు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చిరునామా ధ్రువీకరణకు సంబంధించిన ప్రశ్నను కూడా అదే రోజు పరిష్కరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విప్రో పోర్టల్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ 100 శాతం పూర్తయి, ‘No Action Required’గా కనిపించిందని సంఘం తెలిపింది.

అన్ని నియామక దశలను పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు నిర్దిష్ట జాయినింగ్ తేదీ ఇవ్వలేదని నైట్స్‌ ఆరోపించింది. బాధితులు విప్రో హెచ్‌ఆర్, ఆన్‌బోర్డింగ్ హెల్ప్‌డెస్క్‌లతో పాటు ఇతర అధికారిక మార్గాల ద్వారా పలుమార్లు సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాలేదని పేర్కొంది. విద్యాసంస్థలు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అధికారులు కూడా విప్రో క్యాంపస్ సంబంధిత సిబ్బందిని సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది.

ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు ఇతర అవకాశాలను వదులుకున్నారని, దీంతో విద్యా ఖర్చులు, వసతి, రోజువారీ అవసరాలు, కుటుంబ బాధ్యతల విషయంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నైట్స్‌ పేర్కొంది. దీర్ఘకాలంగా స్పష్టత లేకపోవడం అభ్యర్థుల్లో మానసిక ఆందోళనకు కూడా కారణమవుతోందని తెలిపింది.

కార్మిక శాఖను ఏం కోరిందంటే..

విప్రోతో ఈ అంశాన్ని చర్చించి బాధిత అభ్యర్థులందరి ప్రస్తుత స్థితిని స్పష్టం చేయాలని నైట్స్‌ కార్మిక శాఖను కోరింది. ఆఫర్ లెటర్లు, LOIలు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయా? ఆలస్యానికి అసలు కారణం ఏమిటి? ఆన్‌బోర్డింగ్ ఎప్పటిలోగా పూర్తవుతుంది? అనే అంశాలపై కంపెనీ నుంచి స్పష్టమైన సమాధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. ఇక కొందరి అభ్యర్థిత్వాలను ముందుకు తీసుకెళ్లకూడదని కంపెనీ నిర్ణయిస్తే, వారిని నిరవధికంగా ఎదురుచూడనివ్వకుండా నిర్ణయం, కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కూడా కోరింది.

విప్రో స్పందన ఇదీ..

మరోవైపు, ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని విప్రో స్పష్టం చేసింది. కంపెనీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామక ప్రక్రియ కొనసాగుతుందని, తదుపరి అప్‌డేట్లను అభ్యర్థులకు తెలియజేస్తామని తెలిపింది. అయితే, ఈ వివాదంపై విప్రో నుంచి వచ్చిన ఈ స్పందనలో నిర్దిష్ట జాయినింగ్ తేదీ లేదా 200 మందికి పైగా అభ్యర్థుల కోసం టైమ్‌లైన్ వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement