భారత ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తున్న దిగ్గజ కుటుంబ వ్యాపార సంస్థలు సంపద సృష్టిలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ‘హరూన్ ఇండియా - 2026’ తాజా నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత విలువైన బహుళ తరాల (మల్టీజనరేషనల్) కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుటుంబం రూ.25.83 లక్షల కోట్ల విలువతో దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా మొదటి స్థానంలో నిలిచింది.
టాప్-10 సంపన్న కుటుంబ వ్యాపారాలు
| ర్యాంక్ | వ్యాపార కుటుంబం | విలువ (లక్షల కోట్లలో) |
|---|---|---|
| 1 | అంబానీ కుటుంబం | రూ.25.83 |
| 2 | కుమార్ మంగళం బిర్లా కుటుంబం | రూ.8.14 |
| 3 | జిందాల్ కుటుంబం | రూ.8.02 |
| 4 | బజాజ్ కుటుంబం | రూ.7.70 |
| 5 | మహీంద్రా కుటుంబం | రూ.5.15 |
| 6 | అనిల్ అగర్వాల్ కుటుంబం | రూ.4.45 |
| 7 | మురుగప్ప కుటుంబం | రూ.3.06 |
| 8 | నాడార్ కుటుంబం | రూ.2.91 |
| 9 | ప్రేమ్‌జీ కుటుంబం | రూ.2.72 |
| 10 | ధాని, చోక్సీ, వకీల్ కుటుంబాలు | రూ.2.48 |
అదానీ గ్రూప్ మినహాయింపునకు కారణమేంటి?
ఈ జాబితాలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ లేదనే ప్రశ్న సాధారణంగా ఉద్భవిస్తుంది. హరూన్ వర్గీకరణ విధానం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ తరాలుగా పరంపరగా కొనసాగుతున్న వంశపారంపర్య వ్యాపార సంస్థలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. గౌతమ్ అదానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని హరూన్ ‘తొలి తరం వ్యాపారం’గా పరిగణించింది. తొలి తరం వ్యాపార సంస్థల విభాగంలో అదానీ కుటుంబం రూ.19.57 లక్షల కోట్లు అగ్రస్థానంలో నిలిచింది.
దేశ కార్పొరేట్ పన్ను వసూళ్లలో దాదాపు 17% వాటాను ఈ కుటుంబ వ్యాపార సంస్థలే అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి. తరాలు మారినా సుపరిపాలన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన నాయకత్వంతో ఈ వ్యాపార సామ్రాజ్యాలు గ్లోబల్ మార్కెట్‌లో భారత్‌ను అగ్రపథంలో నిలుపుతున్నాయి.
ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..


