చతికిలపడ్డ బాలీవుడ్‌ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్! | Fortune India Announced Virat Kohli India Most Valuable Celebrity 2026 | Sakshi
Sakshi News home page

చతికిలపడ్డ బాలీవుడ్‌ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్!

Jun 10 2026 1:50 PM | Updated on Jun 10 2026 3:17 PM

Fortune India Announced Virat Kohli India Most Valuable Celebrity 2026

భారత క్రికెట్ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఆసియా ఖండంలో అది పెద్ద స్టార్ క్రీడాకారుడిగా పేరు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ తర్వాత  అంతటి పేరు సంపాదించిన కోహ్లీ ఫిట్‌నెస్‌, రికార్డులపై నిత్యం ప్రశంసల వెల్లువ కురుస్తూనే ఉంటుంది. 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతూ అసామాన్యమైన స్టార్‌డమ్‌ను పొందిన కోహ్లీ తాజాగా తన బ్రాండ్ పవర్‌ను మరోసారి చాటుకున్నాడు.

భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా, గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్‌బ్రాండ్ సంయుక్తంగా తొలిసారి విడుదల చేసిన 'మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీస్' ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ బ్రాండ్ విలువను ఏకంగా రూ.3,542 కోట్లుగా లెక్కగట్టడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

ఈ ర్యాంకింగ్స్‌లో క్రికెటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టాప్ 10 జాబితాలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ధోనీ కూడా చోటు సంపాదించారు. కేవలం సంపాదన, ప్రఖ్యాతి ఆధారంగా కాకుండా.. ఒక సెలబ్రిటీకి ఉన్న విశిష్టత, అభిమానులతో అనుబంధం, సామాజిక బాధ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను నిర్ణయించారు. వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడంలో, బ్రాండ్లపై నమ్మకాన్ని పెంచడంలో సెలబ్రిటీల పాత్రను ఈ అధ్యయనం విశ్లేషించింది.

విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడానికి పలు కారణాలు దోహదం చేశాయి. ప్యూమా, ఆడీ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, ఫిట్‌నెస్ ఐకాన్‌గా ఆయనకున్న ఇమేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో 270 మిలియన్లకు పైగా ఉన్న భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆయన బ్రాండ్ విలువను అమాంతం పెంచాయి. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించచ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌డం, ఫైనల్‌లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం కోహ్లీ మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. అయితే ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేసినప్పటికీ, గాయం వల్ల అతడు జట్టుకు దూరమయ్యాడు.

చదవండి: సెలెక్షన్‌ కమిటీపై భువ‌నేశ్వ‌ర్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు!

Advertisement
 
Advertisement
Advertisement