ఆదివారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 35 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో మెన్ బ్లూ క్లీన్ స్వీప్ చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తమ ఆటగాళ్లపై అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
'ఈ సిరీస్‌లో మా ఆటగాళ్లు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడారు. మూడు మ్యాచ్‌లలోనూ మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాము. కెప్టెన్‌గా ఇది నాకు మొదటి సిరీస్ విజయం. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమైనది మరోసారి చెబుతున్నాను.
జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడేలా చూడటమే నా బాధ్యత. రాబోయే రోజుల్లో మాకు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.
అయితే జట్టు సభ్యులు ఇదే తరహా ధైర్యాన్ని, పట్టుదలను మైదానంలో చూపిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించుకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే మా సిద్దాంతం అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ పేర్కొన్నాడు.


