మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ (Xbox) తన చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మంది అంటే 3,200 మంది ఉద్యోగులను దశలవారీగా తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో తొలి విడతగా 1,600 మందిని వెంటనే విధుల నుంచి తప్పించగా, మిగిలిన కోతలను 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయనుంది. మైక్రోసాఫ్ట్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఖర్చుల నియంత్రణ, ఏఐ ఆధారిత పెట్టుబడుల పెంపు నేపథ్యంలో ఎక్స్‌బాక్స్‌లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఉద్యోగులకు పంపిన లేఖలో ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ సంస్థ ప్రస్తుత పరిస్థితిపై స్పష్టంగా స్పందించారు. "ప్రస్తుతం మా వ్యాపారం ఆరోగ్యకరంగా లేదు. ఇతర ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, పబ్లిషింగ్ సంస్థలతో పోలిస్తే మా లాభ మార్జిన్లు 3 నుంచి 10 రెట్లు తక్కువగా ఉన్నాయి" అని పేర్కొన్నారు. గతంలో చేసిన పలు వ్యూహాత్మక పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, గేమింగ్ మార్కెట్లో పెరిగిన పోటీ, హార్డ్‌వేర్ వ్యయాలు పెరగడం సంస్థపై ఒత్తిడి పెంచాయని వివరించారు.
నాలుగు గేమింగ్ స్టూడియోల విభజన
పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎక్స్‌బాక్స్‌కు చెందిన నాలుగు గేమింగ్ స్టూడియోలను కొత్త యాజమాన్యానికి అప్పగించనుంది. అలాగే మరో స్టూడియో భవిష్యత్తుపై కూడా వ్యూహాత్మక సమీక్ష కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ప్రధాన గేమ్ ప్రాజెక్టులను రద్దు చేసే ఉద్దేశం లేదని సంస్థ స్పష్టం చేసింది.
నిర్వహణ వ్యవస్థలో భారీ మార్పులు
సంస్థలో కొన్ని విభాగాల్లో 14 స్థాయిల మేనేజ్‌మెంట్ ఉండటంతో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని ఆశా శర్మ పేర్కొన్నారు. అందుకే ఇకపై మేనేజ్‌మెంట్ పొరలను గరిష్ఠంగా ఐదు స్థాయిలకే పరిమితం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే బాహ్య విక్రేతలపై (Vendor) వ్యయాన్ని 50 శాతం వరకు తగ్గించే నిర్ణయం తీసుకున్నారు.
కొత్త సీఓఓగా హెలెన్ చియాంగ్
ఎక్స్‌బాక్స్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు హెలెన్ చియాంగ్‌ను కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమించారు. కంటెంట్, హార్డ్‌వేర్, ప్లాట్‌ఫారమ్, సేవలపై సమగ్ర బాధ్యత ఆమెకు ఉంటుంది. మొజాంగ్ (Minecraft), కింగ్ (Candy Crush) వంటి ప్రధాన స్టూడియోలు కూడా ఇకపై నేరుగా సీఈఓ పరిధిలోకి రానున్నాయి.
ఉద్యోగుల తొలగింపులు బాధాకరమైనవేనని, అయితే అవి ఉద్యోగుల ప్రతిభను ప్రతిబింబించవని ఆశా శర్మ స్పష్టం చేశారు. "ఎక్స్‌బాక్స్‌ను మరింత దృఢమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికీ పెట్టుబడులు కొనసాగుతాయి. అయితే ఇకపై మరింత క్రమశిక్షణతో, స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తాం" అని ఆమె పేర్కొన్నారు.
This is an important email I sent today to all employees at XBOX:
Team,
We are beginning the most significant restructure in XBOX history. After careful consideration, I've made the difficult decision to reduce our team by approximately 3,200 throughout FY27. This will include…— ASHA (@asha_shar) July 6, 2026


