మరో పవర్‌ఫుల్ AI మోడల్ వచ్చేసింది! | OpenAI Most Powerful AI Model GPT 5 6 Details | Sakshi
Sakshi News home page

OpenAI: మరో పవర్‌ఫుల్ AI మోడల్ వచ్చేసింది!

Jul 9 2026 4:04 PM | Updated on Jul 9 2026 4:21 PM

OpenAI Most Powerful AI Model GPT 5 6 Details

ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న ఓపెన్‌ఏఐ (OpenAI) అత్యంత శక్తివంతమైన, సరికొత్త AI మోడల్ GPT-5.6ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వంతో.. భద్రతా అంశాలకు సంబంధించిన సమీక్షలు, సాంకేతిక పరీక్షలు పూర్తైన తరువాత దీనిని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ఓపెన్‌ఏఐ విడుదల చేయనున్న GPT-5.6 సిరీస్‌లో సోల్, టెర్రా, లూనా అనే మూడు వేర్వేరు మోడళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు (గురువారం) నుంచి అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

  • సోల్: అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ మోడల్

  • టెర్రా: రోజువారీ అవసరాలు, వ్యాపార వినియోగానికి అనువైన మిడ్ రేంజ్ వెర్షన్

  • లూనా: తక్కువ ఖర్చుతో వేగవంతమైన సేవలు అందించే మోడల్‌

భద్రతాపరమైన ఆందోళనలు
GPT-5.6 విడుదలకు ముందు భద్రతాపరమైన అంశాలు విస్తృత చర్చకు దారితీశాయి. ఈ మోడల్ కంప్యూటర్ కోడ్‌లోని బలహీనతలను గత మోడళ్ల కంటే మరింత సమర్థంగా గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ సామర్థ్యాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. అమెరికా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఓపెన్‌ఏఐ జూన్ నెలలో కొంతమంది అమెరికన్ భాగస్వాములకు మాత్రమే ముందస్తు ప్రివ్యూ యాక్సెస్ కల్పించింది.

అమెరికా మీడియా కథనాల ప్రకారం.. సాంకేతిక పరీక్షలు, ప్రభుత్వ అధికారులతో సమావేశాల అనంతరం GPT-5.6ను విస్తృతంగా విడుదల చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే వైట్ హౌస్ అధికారులు మాత్రం.. ఇది ప్రభుత్వ అధికారిక ఆమోదం కాదని, ఓపెన్‌ఏఐ స్వచ్ఛందంగా తన మోడళ్లను ప్రభుత్వ పరిశీలనకు సమర్పించిందని తెలిపారు.

ప్రత్యర్థి సంస్థలతో పోటీ
ఓపెన్‌ఏఐకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ కూడా ఇటీవల తన అత్యాధునిక Fable 5, Mythos 5 వంటి AI మోడళ్లను విడుదల చేసింది. అమెరికా ప్రభుత్వం విధించిన కొన్ని పరిమితులు తొలగిన తర్వాత.. వాటిని కంపెనీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏఐ రంగంలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

ప్రస్తుతం ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ వంటి సంస్థలు అత్యాధునిక ఏఐ మోడళ్ల అభివృద్ధిలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సంస్థలు భారీ విలువలతో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో GPT-5.6 విడుదల AI పరిశ్రమలో మరో కీలక మైలురాయిగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement