రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీ | Rs 20 Lakh Car Purchase Cash or Loan ChatGPT Breaks It Down | Sakshi
Sakshi News home page

రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీ

Jun 27 2026 4:30 PM | Updated on Jun 27 2026 6:06 PM

Rs 20 Lakh Car Purchase Cash or Loan ChatGPT Breaks It Down

ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.30 లక్షలు ఉంటే, రూ.20 లక్షల విలువైన కారును కొనుగోలు చేయడం ఆర్థికంగా సౌకర్యవంతమేనా? ఒకవేళ కొనాలంటే మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించడం మంచిదా?, లేక లోన్ తీసుకుని కొనడం మంచిదా? అనే ప్రశ్నలకు చాట్‌జీపీటీ వివరంగా సమాధానం ఇచ్చింది.

బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల ఉద్యోగి తన పూర్తి ఆర్థిక వివరాలను చాట్‌జీపీటీకు అందించాడు. అతనికి సంవత్సరానికి రూ.30 లక్షల జీతం, అయితే నెలకు రూ.1.9 లక్షలు చేతికి వచ్చే ఆదాయం. కాగా అతనికి రూ.15 లక్షల పెట్టుబడులు, రూ.5 లక్షల ఎమర్జెన్సీ ఫండ్, రూ.10 లక్షల ఈపీఎఫ్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.40 లక్షల హోమ్ లోన్ ఉండగా, ప్రతి నెల రూ.40 వేల ఈఎంఐ, మరో రూ.40 వేల సిప్ పెట్టుబడులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అతని వద్ద ఎనిమిదేళ్ల పాత హ్యాచ్‌బ్యాక్ కారు ఉంది.

ఈ నేపథ్యంలో రూ.20 లక్షల ఆన్‌రోడ్ ధర ఉన్న కొత్త SUV కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పేర్కొంటూ, రెండు ఎంపికలను చాట్‌జీపీటీ ముందుంచాడు. మొదటిది, మొత్తం రూ.20 లక్షలను పొదుపు నుంచి తీసుకుని ఒకేసారి చెల్లించి కారు కొనడం. రెండోది, రూ.5 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల కార్ లోన్ ద్వారా చెల్లించడం.

ఈ రెండు ఎంపికలను విశ్లేషించిన చాట్‌జీపీటీ, కారు కొనుగోలు మాత్రమే కాకుండా, ఐదు సంవత్సరాలు, పది సంవత్సరాల పాటు కారును మెయింటెన్స్ కోసం అయ్యే మొత్తం ఖర్చును కూడా అంచనా వేసింది. ఇందులో కొనుగోలు ధర, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సర్వీసింగ్, రిపేర్లు, ఇంధనం, టైర్లు, పార్కింగ్, లోన్ వడ్డీ వంటి అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుంది.

చాట్‌జీపీటీ అంచనా ప్రకారం, మొత్తం డబ్బు చెల్లించి కారు కొనుగోలు చేస్తే ఐదేళ్లలో మొత్తం యాజమాన్య వ్యయం సుమారు రూ.28 నుంచి రూ.31 లక్షల మధ్య ఉండొచ్చు. అదే రూ.5 లక్షల డౌన్ పేమెంట్‌తో లోన్ తీసుకుంటే వడ్డీ కారణంగా ఈ ఖర్చు రూ.31 నుంచి రూ.33 లక్షల వరకు పెరగొచ్చు.

పది సంవత్సరాల వ్యవధిలో నగదు చెల్లించి కొనుగోలు చేసిన కారుకు మొత్తం ఖర్చు సుమారు రూ.42 నుంచి రూ.46 లక్షలు, లోన్ తీసుకుని కొనుగోలు చేసిన కారుకు రూ.45 నుంచి రూ.49 లక్షలు అవుతుందని చాట్‌జీపీటీ అంచనా వేసింది. ఈ ఖర్చులో అత్యధిక భాగం కారు విలువ తగ్గడం, ఇంధనం, ఇన్సూరెన్స్, నిర్వహణ ఖర్చులు ఉంటాయని వెల్లడించింది.

అయితే.. తుది నిర్ణయంలో చాట్‌జీపీటీ ఆసక్తికరమైన సూచన చేసింది. మొత్తం రూ.20 లక్షలను ఒకేసారి చెల్లించడం వల్ల వడ్డీ భారం ఉండదు. కానీ అలా చేస్తే ఇప్పటికే ఉన్న పెట్టుబడులు దాదాపు ఖాళీ అవుతాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన డబ్బు అందుబాటులో ఉండదు. అలాగే పెట్టుబడులు భవిష్యత్తులో ఇచ్చే వృద్ధి ప్రయోజనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.

కాబట్టి.. రూ.5 లక్షల డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్లకు లోన్ తీసుకోవడం మంచి నిర్ణయం అని చాట్‌జీపీటీ పేర్కొంది. ఇలా చేయడం వల్ల కొంత వడ్డీ చెల్లించాల్సి వచ్చినప్పటికీ, చేతిలో నగదు నిల్వ ఉంటుంది. పెట్టుబడులు కొనసాగుతాయి. దీర్ఘకాలంలో ఆర్థిక భద్రత కూడా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి: జూన్ 30 తర్వాత పాత నోట్ల రద్దు?: స్పందించిన బ్యాంక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement