2026 జూన్ 30 తర్వాత పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్వీకరించదని ఒక వార్త వైరల్ సోషల్ మీడియాలో అయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. చాలామంది ఇది మరోసారి పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జరుగుతుందేమోనని భావించారు. అయితే.. ఈ వార్త పూర్తిగా అసత్యమని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారికంగా స్పష్టం చేసింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో #FakeMessageAlert హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, ''2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను 2026 జూన్ 30 తర్వాత మా శాఖలు స్వీకరించవని ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం పూర్తిగా తప్పు. వినియోగదారులు ఇలాంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దు, ఇతరులకు పంపవద్దు. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి'' అని తెలిపింది.
A false message is being circulated claiming that pre-2005 ₹10, ₹20, ₹50 & ₹100 notes will not be accepted after 30th Jun'26. Bank of Maharashtra clarifies that this information is incorrect. Customers are requested to rely only on official sources for authentic information. pic.twitter.com/afF5czNO7e
— Bank of Maharashtra (@mahabank) June 26, 2026
వైరల్ వార్తలో జరిగిన ప్రచారం
వైరల్ అయిన కథనాల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాత నోట్లను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని, త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను వెంటనే మార్చుకోవాలని భావించారు. అయితే.. ఈ ప్రచారాన్ని బ్యాంక్ పూర్తిగా ఖండించింది. అంతే కాకుండా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా దీనికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.
ఆర్‌బీఐ ప్రకటన
2015లో ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చలామణి తగ్గిపోయిందని, అవసరమైతే ప్రజలు వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే.. ఆ నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ (Legal Tender)గానే కొనసాగుతాయని కూడా స్పష్టంగా తెలిపింది. కొత్త నోట్లలో భద్రతా ఫీచర్లు మెరుగ్గా ఉండటంతో నకిలీ నోట్ల తయారీని అరికట్టడం సులభమవుతుందని ఆర్‌బీఐ వివరించింది. కానీ.. పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు లేదా చెల్లుబాటు కాకుండా చేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించలేదు.
ఇదీ చదవండి: 35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్


