రూ.7 వేల కోట్ల వేతనం.. ఎవరీ శంఖ్ మిత్ర? | Who Is Shankh Mitra? Indian-Origin CEO Becomes World's Second Highest Paid Executive | Sakshi
Sakshi News home page

రూ.7 వేల కోట్ల వేతనం.. ఎవరీ శంఖ్ మిత్ర?

Jun 26 2026 3:51 PM | Updated on Jun 26 2026 4:06 PM

Who Is Shankh Mitra? Indian-Origin CEO Becomes World's Second Highest Paid Executive

ప్రపంచ కార్పొరేట్ రంగంలో ఇండియన్స్ ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. భారతీయ మూలాలున్న శంఖ్ మిత్ర ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఉండగా, ఆయన తర్వాతి స్థానాన్ని శంఖ్ మిత్ర దక్కించుకోవడం విశేషం.

అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అయిన 'వెల్‌టవర్‌'కు మిత్రా ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా (CEO) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2025 సంవత్సరానికి ఈయన మొత్తం 821 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లకు పైగా) వేతనంగా అందుకున్నారు. ఇది గత దశాబ్దంలో ప్రపంచంలోని పబ్లిక్ కంపెనీల సీఈఓలకు ఇచ్చిన అత్యంత భారీ వేతన ప్యాకేజీల్లో ఒకటిగా నిలిచింది.

శంఖ్ మిత్రకు లభించిన మొత్తం వేతనంలో దాదాపు 99 శాతం స్టాక్ అవార్డుల రూపంలోనే ఉంది. ముఖ్యంగా 2025 అక్టోబర్‌లో కంపెనీ ఆయనకు 789 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ప్రోత్సాహకంగా కేటాయించింది. ఆ షేర్ల విలువ ఏడాది చివరినాటికి 1 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. దీంతో ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన సీఈఓల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు.

శంఖ్ మిత్ర వేతనం ప్రపంచంలోని పలువురు ప్రముఖ కంపెనీల సీఈఓల కంటే చాలా ఎక్కువగా ఉంది. గోల్డ్‌మాన్ సాక్స్ సీఈఓ డేవిడ్ సోలోమన్ 119 మిలియన్ డాలర్లు, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేశ్ అరోరా 100 మిలియన్ డాలర్లు మాత్రమే వేతనంగా పొందారు. వీరందరినీ అధిగమించి శంఖ్ మిత్ర ప్రత్యేక గుర్తింపు సాధించారు.

శంఖ్ మిత్ర భారతదేశంలోని కోల్‌కతాకు చెందినవారు. ఆయన తన ఇంజినీరింగ్ విద్యను జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో అప్లైడ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్లో ఎంబీఏ పూర్తి చేసి అంతర్జాతీయ ఆర్థిక రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

తన వృత్తి జీవితాన్ని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC)లో ప్రారంభించిన శంఖ్ మిత్ర, తరువాత ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటాడెల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థల్లో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేశారు. అనంతరం మిలీనియం మేనేజ్‌మెంట్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా సేవలందించారు.

2016లో వెల్‌టవర్ సంస్థలో చేరిన ఆయన, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, వైస్ చైర్మన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వంటి కీలక పదవులను విజయవంతంగా నిర్వహించారు. చివరకు 2020 అక్టోబర్‌లో కంపెనీ సీఈఓగా, డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement