వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా.. విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు విమానాలు ఆలస్యంగా బయలుదేరడం లేదా పూర్తిగా రద్దు కావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయి. అయితే.. విమానం ఆలస్యమైనా లేదా రద్దైనా ప్రయాణికులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు లభిస్తాయి. ఈ హక్కులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన ప్యాసింజర్ చార్టర్‌లో స్పష్టంగా పేర్కొంది.
విమానం ఆలస్యమైతే..
నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి చేరుకుని చెక్-ఇన్ పూర్తి చేసి ఉంటే, విమానం ఆలస్యమైన సమయాన్ని బట్టి ఎయిర్‌లైన్ సంస్థ ఉచితంగా భోజనం, తాగునీరు లేదా ఇతర రిఫ్రెష్‌మెంట్లు అందించాలి. ప్రయాణ సమయం, ఆలస్యమైన గంటలను బట్టి ఈ సౌకర్యాలు అందించాలని నిబంధనలు చెబుతున్నాయి.
రీఫండ్ ఎంపిక
దేశీయ విమానం ఆరు గంటలకు పైగా ఆలస్యమవుతుందని ముందే తెలిసినప్పుడు, ఎయిర్‌లైన్ సంస్థ కనీసం 24 గంటల ముందే ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాన్ని ఎంచుకోవచ్చు, లేదా పూర్తి టికెట్ మొత్తాన్ని రీఫండ్‌గా పొందవచ్చు.
ఒకవేళ ఎయిర్‌లైన్ సంస్థ సరైన సమయంలో ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోతే లేదా అదే టికెట్‌పై బుక్ చేసిన కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యేలా జరిగితే, కేవలం రీఫండ్ మాత్రమే కాకుండా అదనంగా పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయ విమానం కోసం ప్రయాణికులు విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వస్తే.. ఆ సమయంలో కూడా భోజనం, రిఫ్రెష్‌మెంట్లు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్ సంస్థదే. అయితే.. టికెట్ బుక్ చేసుకునే సమయంలో సరైన మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలు ఇవ్వాలి. ఎందుకంటే విమానం ఆలస్యానికి సంబంధించిన వివరాలు ఇక్కడ పంచుకుంటారు. సరైన వివరాలు ఇవ్వని సమయంలో విమానం రద్దు లేదా ఆలస్యం గురించి సమాచారం అందకపోయినా, ఆర్థిక పరిహారం కోరే హక్కు ఉండదు.


