కుండపోత వర్ష బీభత్సం.. 5000 సిలిండర్లు గల్లంతు.. | Mumbai Raigad floods wash away 5000 LPG cylinders: Viral Video | Sakshi
Sakshi News home page

కుండపోత వర్ష బీభత్సం.. 5000 సిలిండర్లు గల్లంతు..

Jul 9 2026 8:12 AM | Updated on Jul 9 2026 8:38 AM

Mumbai Raigad floods wash away 5000 LPG cylinders: Viral Video

ముంబై: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇక, తాజాగా రాయ్‌గఢ్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. భారీ వర్షాల కారణంగా సుమారు 5,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సిలిండర్లు కనిపిస్తే ప్రజలు వాటిని తాకవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సిలిండర్లు నివాస ప్రాంతాలు, రోడ్లు, నదీ ప్రవాహాల సమీపంలో కనిపించవచ్చని అధికారులు తెలిపారు. వాటిని తరలించేందుకు లేదా తెరవడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. సిలిండర్లలో గ్యాస్ మిగిలి ఉండే అవకాశం ఉన్నందున లీకేజీ, మంటలు లేదా పేలుడు వంటి ప్రమాదాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి సురక్షితంగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక యంత్రాంగం ప్రజల భద్రత కోసం పర్యవేక్షణ పెంచింది. ఇక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులు నెలకొన్నాయి. రాయ్‌గఢ్‌లో రవాణా, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు.

ముంబైపై పంజా..
ఇదిలా ఉండగా.. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గత ఏడు రోజుల్లో నమోదైన వర్షపాతం రికార్డు స్థాయికి చేరుకుంది. శాంతాక్రూజ్ వాతావరణ కేంద్రంలో 1,017.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత ఏడాది మొత్తం జూలై నెలలో కురిసిన వర్షపాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భారత వాతావరణ శాఖ (IMD) ముంబై, థానే ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కొనసాగించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ఇక భారీ వర్షాలతో ముంబైకి తాగునీటిని అందించే విహార్, తులసి సరస్సులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో నగర నీటి సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంత మేర తగ్గినట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement