'బిగ్‌ న్యూస్‌' అంటూ ట్రంప్‌ సస్పెన్స్ | Trump Teases Really Big News; Primetime Speech Sparks Speculation | Sakshi
Sakshi News home page

'బిగ్‌ న్యూస్‌' అంటూ ట్రంప్‌ సస్పెన్స్

Jul 16 2026 6:45 AM | Updated on Jul 16 2026 6:50 AM

Trump Teases Really Big News; Primetime Speech Sparks Speculation

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఉత్కంఠ రేపుతున్నారు. ఇవాళ రాత్రికి ప్రత్యేక ప్రైమ్‌టైమ్‌ ప్రసంగం చేయనున్నట్లు ప్రకటించారు. "ఇది నిజంగానే చాలా పెద్ద వార్త"  అంటూ ఆసక్తిని మరింత పెంచారు. అయితే ఆ ప్రకటన ఏంటన్నది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు.

వైట్‌హౌస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దీంతో.. యుద్ధం సంబంధిత ప్రకటన కాదనేది స్పష్టమైపోయింది. అయితే.. ప్రసంగంలో ప్రధానంగా అమెరికా ఎన్నికల వ్యవస్థ, మరీ ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కొత్త సమాచారం, ఓటింగ్‌ యంత్రాల భద్రత వంటి అంశాలు ఉండే అవకాశం ఉంది. అలాగే తాజాగా డీక్లాసిఫై చేసిన నిఘా సమాచారాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రసంగం నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర (మిడ్‌టర్మ్‌) ఎన్నికలకు కొద్ది నెలల ముందే రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌పై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ట్రంప్‌ తన మద్దతుదారులను మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు పెంచే అవకాశం ఉందని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు.

మళ్లీ అదే వివాదమా?
2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ చేతిలో ఓడిపోయిన ట్రంప్‌.. అప్పటి నుంచి ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అనేక దర్యాప్తులు, కోర్టు విచారణలు స్పష్టం చేశాయి. అమెరికా సైబర్‌ సెక్యూరిటీ సంస్థ (CISA) కూడా 2020 ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రమైన ఎన్నికలుగా పేర్కొంది.

అయినప్పటికీ ట్రంప్‌ ప్రభుత్వం 2020 ఎన్నికలకు సంబంధించిన పలు పత్రాలను సేకరించడం, దర్యాప్తులను కొనసాగించడం, ఓటింగ్‌ విధానాల్లో మార్పులకు ప్రయత్నించడం వంటి చర్యలు చేపడుతోంది. ఓటర్ల గుర్తింపు నిబంధనలు కఠినతరం చేయడం, మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్లపై పరిమితులు విధించడం వంటి అంశాలను కూడా ట్రంప్‌ ముందుకు తీసుకొస్తున్నారు.

ఇక ట్రంప్‌ ప్రసంగంపై డెమొక్రాట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలపై ఆధారంలేని ఆరోపణలను మరోసారి ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీయొద్దని వారు హెచ్చరిస్తున్నారు. 

భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 6గం. ప్రాంతంలో ట్రంప్‌ ప్రసంగం ఉండనుంది.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement