పట్నా: చాలామంది వృద్ధులు మంచానికే పరిమితమై, అనారోగ్యంతో బాధపడుతూ, ఇతరులపై ఆధారపడే పరిస్థితిలో ఉంటారు. అలాంటిది 103 ఏళ్ల హబీబన్ ఖాతూన్ మాత్రం తన భూమిని తిరిగి పొందేందుకు దశాబ్దాల పాటు న్యాయ పోరాటం సాగించారు. 3 దశాబ్దాలకు పైగా న్యాయం కోసం ఎదురుచూశారు.
తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన ఖాతూన్ పోరాటం ఇప్పుడు ఫలించింది. కేసులో ఆమె గెలిచింది. గ్రామంలో 35 ఏళ్లుగా కొనసాగిన భూ వివాదం ఈ తీర్పుతో ముగిసింది. కోర్టు ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య వివాదాస్పద భూమిని జిల్లా యంత్రాంగం అధికారికంగా ఖాతూన్‌కు అప్పగించింది.
అధికారుల వివరాల ప్రకారం.. దాదాపు 1,600 చదరపు అడుగుల భూమికి సంబంధించిన వివాదం 1994 నుంచి కొనసాగుతోంది. ఈ కేసు సివిల్ కోర్టులో విచారణకు వచ్చింది. సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత కోర్టు ఖాతూన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి, ఆదేశాలను అమలు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.
కోర్టు తీర్పు తర్వాత రెవెన్యూ శాఖ, స్థానిక యంత్రాంగం, పోలీసులు కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త బృందం గ్రామానికి చేరుకుంది. అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత భూమిని ఖాతూన్‌కు అప్పగించారు. ఈ ప్రక్రియలో భాగంగా డప్పులు మోగిస్తూ గ్రామంలో కోర్టు ఆదేశాన్ని బహిరంగంగా ప్రకటించారు.
ఈ వివాదం సున్నితమైనది కావడంతో ఘటన స్థలంలో దాదాపు 300 మంది పోలీసులను మోహరించారు. కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లు, రెవెన్యూ అధికారులు, కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు మొత్తం ప్రక్రియలో అక్కడే ఉన్నారు. యంత్రాంగం పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
భూమిని పొందిన తర్వాత హబీబన్ ఖాతూన్ కుటుంబం న్యాయవ్యవస్థకు, యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపింది. ఎన్నో ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత తమకు రావాల్సిన హక్కు లభించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. సహనం, న్యాయ ప్రక్రియపై నమ్మకం వల్లే ఈ ఫలితం వచ్చిందని వారు తెలిపారు.
కల్యాణ్‌పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినీత్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు భూమి స్వాధీనం అప్పగించామని చెప్పారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని వెల్లడించారు.


