పూరీ క్షేత్ర మహావీధిలో... | Sakshi Guest Column On Puri Jagannath Ratha Yatra | Sakshi
Sakshi News home page

పూరీ క్షేత్ర మహావీధిలో...

Jul 16 2026 12:35 AM | Updated on Jul 16 2026 12:35 AM

Sakshi Guest Column On Puri Jagannath Ratha Yatra

సందర్భం

శ్రీజగన్నాథుడి ప్రార్థనలు, కీర్తనలు చిన్ననాటి నుంచి నా జ్ఞాపకాల్లో పదిలమై ఉన్నాయి. పాఠశాలలో, కళాశాలలో చదువుకొనేటప్పుడు మహాప్రభు జగన్నాథుని భజనలు పాడటం నాకు చాలా ఆనందాన్ని చ్చేది. నేనీ మధ్య భజనలు పాడటం లేదు కానీ, ప్రతి రోజూ ఆ మహా ప్రభుని స్మరిస్తాను. భజనలోని ఓ నాలుగు పదాలైనా పలకని రోజుండదు. ఈనాటికీ భక్త కవి మధు సూదనరావు రచించిన పాటను పాడుతూనే ఉంటాను. ‘‘అంతటా ఉండే ఓ మహాప్రభూ... నువ్వు రాత్రింబగళ్లు నా తోడే ఉన్నావు... ఈ జ్ఞాపకంతో నిన్ను ఎల్లప్పుడూ పూజిస్తాను నా పూర్ణ హృదయంతో’’ అని ఆ పాటకి అర్థం. 

మహా ఆలయం
మహాప్రభు జగన్నాథుని గురించి ఇంట్లో తరచూ మాట్లాడు కొనేవారు. మా గ్రామంలోనూ ఇలాంటి చర్చలే ఎక్కువగా జరుగు తుండేవి. నేను గ్రామ పాఠశాలలో చదువుతున్నప్పుడు భక్త సాల్బేగ్‌ రచించిన ‘ఆహే నీల శైల’ అనే ప్రార్థనను క్రమం తప్పకుండా పఠించేవారు. జగన్నాథుని గురించి మా టీచర్‌ అనేక విషయాలు చెబుతూ ఉండేవారు. ‘‘పూరీలో పెద్ద ఆలయం ఉంది. అంతటి గొప్ప ఆలయం మరొకటి లేదు! ఆ ఆలయంలో తన చెల్లెలు సుభద్ర, సోదరుడు బలభద్రునితో కలసి మహాప్రభు పూజలందు కుంటారు. మహాప్రభు నల్లని రంగులో, గుండ్రని కళ్లతో ఉంటారు. 

సుభద్ర పసుపు రంగులో, బలభద్రుడు వెన్నెల్లో వికసించిన పుష్పంలా శ్వేతవర్ణంలో ఉంటారు. ఒక్కసారి ఆ మూర్తులను చూస్తే, ఎప్పటికీ మరచిపోం’’ అని చెప్పేవారు. జగన్నాథుడే మహా ప్రభు వనీ, ఆయన ప్రసాదమే మహా ప్రసాదమనీ కూడా మా టీచర్‌ చెప్పేవారు. ఆయన ఆలయమే ‘బడ దేవుళ’ లేదా పెద్ద ఆలయం. ఆయన మార్గమే బడ దాండ. అంటే ఉత్కృష్ట మార్గం. ఆయన సముద్రమే మహోదధి లేదా గొప్ప మహాసముద్రం. 

మయూర్భంజ్‌ జిల్లాలోని మా ఊరు ఉపర్బేడా నుంచి పురుషోత్తమ క్షేత్రం పూరీ చాలా దూరంలో ఉంటుంది. మరి పూరీని సందర్శించే అవకాశం నాకెలా వస్తుంది? నేను పెద్దయ్యాక, భువనేశ్వర్‌కి వెళ్లాను. అక్కడ బాలికల ఉన్నత పాఠశాల యూనిట్‌–2లో చేరాను. అక్కడే వసతి గృహంలో ఉండేదాన్ని. అక్కడ ఉన్నప్పుడే పూరీ, భువనేశ్వర్, కోణార్క్‌ సందర్శించే అవకాశం లభించింది. మొదటిసారి మహా ప్రభును దర్శించుకున్న జ్ఞాపకం ఇప్పటికీ నా మదిలో స్పష్టంగా ఉంది. ఎంత అద్భుతమైన ఆలయం! ఎంత తేజోవంతమైన దేవతా మూర్తులు! 

శ్రీ క్షేత్రలో ఏడాదిలోని పన్నెండు నెలల్లో పదమూడు ఉత్స వాలు జరుగుతాయి. కానీ రథయాత్ర వైభవం అద్వితీయం. మహా ప్రభు దర్శనం కోసం ఏడాది పొడవునా భక్తులు ఆలయాన్ని సంద ర్శిస్తారు. కానీ ఏడాదికోసారి మహాప్రభువే ఆలయాన్ని వదలి విశాల పథంలో గుండిచా ఆలయానికి చేరుకొని భక్తులకు దర్శన మిస్తారు. మూడు అద్భుతమైన రథాలపై... చక్రరాజ సుదర్శనునితో పాటు... ముగ్గురు దేవతామూర్తులు గుండిచా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే ఏడు రోజులు ఉండి, ఆ తర్వాత తిరుగు ప్రయాణ మవుతారు.

నా తోడు...
చిన్నతనం నుంచి మహాప్రభు జగన్నాథుని భక్తురాలిని. నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ సమస్యలన్నింటి నుంచి మహాప్రభు నన్ను బయటకు తీసుకొచ్చారు. ఎంతైనా నేను ఆయన బిడ్డనే కదా! భారత రాష్ట్రపతి పదవికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు.. నేను భక్తిపూర్వకంగా మహాప్రభుని తలచు కున్నాను. ‘నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకెళుతున్నావు. నన్ను ముందుకు నడిపించు. ఎప్పుడూ నాతోనే ఉండు’ అని ప్రార్థించాను. 

నేను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో రథయాత్ర ఉత్సవం జరిగింది. నేను అప్పుడు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. రథయాత్ర రోజు ఉదయమే నేను ఢిల్లీలోని హాజ్‌ ఖాస్‌లో ఉన్న జగన్నాథుని ఆలయానికి వెళ్లాను. మహాప్రభు దర్శనం చేసుకున్నాను. పూర్తి విశ్వాసంతో నామినేషన్‌ దాఖలు చేశాను. 2022 జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలుకి వెళుతూ... దారిలో మహా ప్రభు జగన్నాథుని స్మరిస్తూనే ఉన్నాను. రాష్ట్రపతిగా నేను మొదటి సారి ప్రసంగించినప్పుడు ఆయన నాతోనే ఉన్నట్టు అనిపించింది.

క్షేత్ర రాజం
అయినప్పటికీ, మహాప్రభు దర్శనం కోసం నా హృదయం పరితపించింది. రోజులు గడచిపోతున్నాయి కానీ పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. ఆయన అనుమతిస్తేనే తప్ప ఎవరికైనా ఆయన దర్శనం ఎలా లభిస్తుందని నాకు అనిపించింది. ‘మహాప్రభూ! నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. దయచేసి నన్ను పూరీకి పిలిచి, మీ దర్శన భాగ్యం ఇవ్వండి’ అని మౌనంగా ప్రార్థించాను. అనతి కాలంలోనే పూరీ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. ఆ రోజు 2022 నవంబర్‌ 10. పూరీకి చేరుకున్న తర్వాత వాహన శ్రేణి శ్రీమందిర్‌ దిశగా ముందుకు వెళుతోంది. పూరీలోని బడ దాండ వద్దకు చేరుకోగానే అనిర్వచనీయమైన అనుభూతి నన్ను ముంచెత్తింది. 

బడ దాండ శ్రీ జగన్నాథునిది. ఇక్కడ ప్రొటోకాల్‌ పాటించాల్సిన అవసరం ఉందా? అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ క్షేత్ర రాజంగా పూరీ ప్రసిద్ధి చెందింది. దేవుళ్లకే దేవుడు మహాప్రభు. ఎలాంటి ఆలోచనలు లేకుండా నా కారుని ఆపించాను. నా కారు ఆగగానే వెనుక వస్తున్న కార్లనీ కూడా ఆగిపోయాయి. ఏం జరుగుతుందో మిగిలిన వారికి అర్థమయ్యేలోపే... చెప్పులు లేకుండా బడ దాండపై నడవడం మొదలుపెట్టాను. అక్కడికి శ్రీ మందిర్‌ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ శిఖరం మీద ఉన్న నీల చక్రం, పతిత పావన ధ్వజం మీదే నా దృష్టిని సారించి ముందుకు సాగాను.

ఆలయ సింహద్వారానికి చేరుకొనేసరికి... నేను స్థిమితంగా ఉండలేకపోయాను. బడ దాండ మీద దుమ్ములోనే సాష్టాంగ నమ స్కారం చేసి... ఆ మహాప్రభుకి నా ప్రణామాలు అర్పించాను. గర్భ గుడికి చేరుకొని నలుగురు దేవతామూర్తులను దర్శనం చేసుకుని, దైవికానందంతో ఉప్పొంగిపోయాను. లోకంలోని జనుల కష్టాలను తీర్చేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అందుకే ఆయన విశాలమైన గుండ్రటి నేత్రాలు ఎప్పుడూ రెప్ప వాల్చవు. ఆయనకి పెద్దాచిన్నా తారతమ్యం లేదు. సమానత్వమే ఆయన మంత్రం. ఆయన దీవెనలతోనే... సమాజంలోని ప్రతి వర్గానికి సేవ చేసేందుకు నన్ను నేను అంకితం చేసుకున్నాను. గుండ్రని కన్నులతో ఉన్న మహాప్రభు జగన్నాథుని చూస్తూ... ‘ఓ మహాబాహూ! ప్రజ లకు సేవ చేయాలనే నా అంకితభావం కొనసాగేలా ఆశీర్వదించు. ఓ కృపానిధీ! నా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించు’ అని చేతులు జోడించి ప్రార్థించాను.


ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి
(నేడు జగన్నాథ రథయాత్ర ప్రారంభం) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement