ప్రియుడి సోదరుడి కక్ష.. అమాయక ప‍్రియురాలు బలి | Bengaluru Law Student Killed For Breaking Up With Man | Sakshi
Sakshi News home page

ప్రియుడి సోదరుడి కక్ష.. అమాయక ప‍్రియురాలు బలి

Jul 16 2026 6:32 PM | Updated on Jul 16 2026 7:02 PM

Bengaluru Law Student Killed For Breaking Up With Man

ప్రేమ పేరుతో మొదలైన పరిచయం చివరకు విషాదాంతమైంది. ప్రేమపై యువతికి నమ్మకం దెబ్బతింది. చివరకు చోటుచేసుకున్న పరిణామాలు యువతి ప్రాణాలనే బలితీసుకున్నాయి. ఈ ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.

లా చదువుతున్న అమృత అనే విద్యార్థిని ధనుష్‌ అనే ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఆ యువకుడికి అప్పటికే పెళ్లి జరిగి, ఓ పిల్లాడు కూడా కూడా ఉన్నాడు. తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ విషయాన్ని తన ప్రియురాలు అమృతకు చెప్పలేదు.

అమృత ఓ పిజ్జా దుకాణంలో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసేది. అమృతకు ధనుష్‌తో కుటుంబ పరిచయం ద్వారా మాటలు కలిశాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ధనుష్‌కు ఇప్పటికే విడాకులు అయ్యాయన్న విషయం, ఓ బిడ్డ ఉన్న విషయాన్ని దాచిపెట్టాడని తెలుసుకున్న తర్వాత అమృత బ్రేకప్‌ చెప్పేసింది.

ఆ యువతి బ్రేకప్‌ నిర్ణయం తీసుకున్నందుకు ధనుష్ సోదరుడు సూర్య అమృతను బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. జులై 13న అమృతను ఇంటి సమీపంలో సూర్య అడ్డగించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సూర్య అమృత ఛాతీ, వీపుపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న అమృతను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మరణించింది.

దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యతో పాటు ధనుష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అమృత మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం సీవీ రామన్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement