గత ఏడాది జూన్ నుంచి అజ్ఞాతంలో జావేద్
అమ్మమ్మ ఇంట్లో బాబా అవతారం
అరెస్టు తప్పించుకోవడానికి బాబా వేషం
దువా ఇస్తున్న ఫొటో సోషల్ మీడియాలో పోస్టు.. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: లేక్ పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్న జావేద్ 2018లో సైఫాబాద్ ఠాణా పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గత ఏడాది జూన్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఇతడిపై నాన్–బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయింది. ఈ విషయం తెలిసి అరెస్టును తప్పించుకోవడానికి బాబా అవతారం ఎత్తాడు. ఇతడి స్నేహితుడు సోషల్‌మీడియాలో షేర్ చేసిన ఫొటో జావేద్ ఆచూకీపై ఆధారాన్ని ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ నెల రోజులు గాలించి చెరియాలలో మంగళవారం పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది.
కోర్టుకు, పోలీసుల వద్ద హాజరుకాకుండా...
ఎంఎస్ మక్తా ప్రాంతానికి చెందిన మహ్మద్ షేక్ జావేద్‌పై లేక్ ఠాణాలో రౌడీషీట్ ఉంది. 2018లో సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఐదో నిందితుడిగా అరెస్టు అయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఇతడు గత ఏడాది జూన్ 5 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అటు కోర్టు వాయిదాలకు, ఇటు టాస్క్‌ఫోర్స్, లేక్ పోలీసుస్టేషన్‌లో హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఇతడిపై న్యాయస్థానం ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. జావేద్‌ను ఔట్ ఆఫ్ వ్యూలో (ఓవీ) నేరగాళ్ల జాబితాలో చేర్చిన ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరు నెలలుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. తన ఫోన్, సోషల్‌మీడియా ఖాతాలతో సహా ఏదీ వినియోగించకుండా ఉన్న జావేద్ తన ఉనికి బయటపడనీయలేదు.
అమ్మమ్మ ఇంట్లో మకాం... బాబా అవతారం...
ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి.రాఘవేందర్ నేతృత్వంలోని బృందం జావేద్ స్నేహితులు, బంధువుల సోషల్‌మీడియా ఖాతాలను విశ్లేషించడం ప్రారంభించింది. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి జావేద్ ఈ ఏడాది జనవరి నుంచి సంగారెడ్డి జిల్లా చెరియాల్ రోడ్డు సమీపంలోని తన అమ్మమ్మ ఇంట్లో తలదాచుకుంటున్నాడు. నకిలీ బాబా అవతారం ఎత్తి కంది మండలంలో చెరియాల్ రోడ్డు వద్ద ఉన్న జిందేషా మదార్ దర్గాలో పూజారిగా చేరాడు. తన వద్దకు వచ్చిన వారికి దువా ఇస్తున్నట్లు నటిస్తూ వారందరినీ మోసం చేస్తున్నాడు. ప్రధానంగా చిన్నారులు, మహిళలకు దువా ఇస్తున్నట్లు హడావుడి చేసే వాడు. నగరానికి చెందిన జావేద్ స్నేహితుడు అతడు నిజమైన బాబా అని నమ్ముతూ ఇటీవల వెళ్లి అతడికి కలిసి వచ్చాడు. ఆ సందర్భంలో ఓ మహిళకు దువా ఇస్తుండగా ఫొటో తీశాడు.
నెల రోజులు నిఘా ఉంచి...
ఈ ఫొటోను సదరు స్నేహితుడు తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. అప్పటికే అనేక ఖాతాలను విశ్లేషిస్తున్న ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ కంట్లో ఇది పడింది. వెంటనే అతడిని పిలిచిన అధికారులు ‘జావేద్ బాబా’ అడ్రస్ తెలుసుకున్నారు. కానిస్టేబుల్ పురుషోత్తం వారం రోజుల పాటు చెరియాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి జిందేషా మదార్ దర్గాలో జావేద్ ఆచూకీ కనిపెట్టాడు. అయితే అక్కడ అరెస్టు చేస్తే ఇబ్బందులు వస్తాయని అతడి కదలికలపై నెల రోజులుగా నిఘా ఉంచారు. సైఫాబాద్ నానా మియా మసీదు సమీపంలోని పూల్ బాగ్ ప్రాంతానికి వచ్చిన జావేద్‌ను గుర్తించి పట్టుకున్నారు. చేరుకుని, నిందితుడు మహ్మద్ షేక్ జావేద్‌ను విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న క్యారీబ్యాగ్‌లో ఉన్న 115 గ్రాముల గంజాయి, మారువేషం కోసం ఉపయోగించిన ఆకుపచ్చ రంగు పీర్ బాబా దుస్తులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.


