ఎండలకు బ్రేక్‌.. తెలంగాణకు చల్లటి కబురు | Telangana Weather, Light Rains Likely In Hyderabad And Several Districts As Low Pressure Area Intensifies | Sakshi
Sakshi News home page

ఎండలకు బ్రేక్‌.. తెలంగాణకు చల్లటి కబురు

Jul 16 2026 9:24 AM | Updated on Jul 16 2026 11:03 AM

Telangana Rain Alert: Showers Likely Several Districts Hyderabad Get Relief

సాక్షి, హైదరాబాద్‌: జులైలోనూ ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఒడిశా సమీపంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉండగా.. ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వర్ష సూచన కనిపిస్తోంది.

అల్పపీడనం(LPA)  ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మేఘావృతంగా మారే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశాలున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణంగా పొడి వాతావరణం కొనసాగినప్పటికీ.. సాయంత్రం నుంచి రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కొంతకాలంగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది.

పలు జిల్లాల్లో ఇప్పటికే చినుకులు
గత 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌లో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా కోస్గిలో 15 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ పరిశీలనలు వెల్లడించాయి.

ఈ జిల్లాల్లో చినుకులకు అవకాశం
గురువారం ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదంటే చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు ప్రస్తుతం అవకాశం తక్కువగానే ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విస్తారంగా కాకపోయినా.. అక్కడక్కడ కురుస్తున్న ఈ వర్షాలు ఎండల తీవ్రత మధ్య ప్రజలకు కొంత ఊరటనిస్తున్నాయి.

వర్షాల కోసం ఎదురుచూపులు
నైరుతి రుతుపవనాల కాలం కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరిన్ని ప్రాంతాల్లో చినుకులు కురిస్తే వ్యవసాయ పనులకు ఊతమిచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement