ప్రేమకు భాష ఉండదు.. బంధానికి రక్తసంబంధమే అక్కర్లేదు.. మనసుకు దగ్గరైన ప్రాణం దూరమైతే.. ఆ బాధ మనిషి దైనా, మూగజీవిదైనా ఒక్కటే. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ ఘటన అదేవిషయాన్ని గుర్తు చేసింది. 14ఏళ్లుగా తమ కుటుంబలో సభ్యురాలిగా, పిల్లలా, తోడుగా ఉన్న పెంపుడు శునకం ‘అమ్ములు’ అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. యజమానులు కన్నీరుమున్నీరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
బిస్కెట్ వేసిన మమకారాణికి..
గోదావరిఖని గాం«దీనగర్‌కు చెందిన గుండేటి లక్ష్మీ–మల్లేశం దంపతులు 14 ఏళ్ల క్రితం పదిరోజుల వయసున్న కుక్కపిల్ల ఇంటి ముందు తిరుగుతుంటే.. బిస్కెట్లు వేశారు. ఈ మమకారాణికి పిల్లశునకం ఏకంగా ఇంట్లోకే వచ్చింది. అక్కున చేర్చుకున్న దంపతులు ‘అమ్ములు’ అని పేరు పెట్టారు. అప్పటినుంచి వారి కుటుంబంలో సభ్యురాలే అయింది. సంతోషం, బాధలు, పండుగల్లోనూ, ఒంటరితనంలోనూ అమ్ములు వారి వెంటే ఉండేది.
వనదేవతలకు ఎత్తు బంగారం
గతంలో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అమ్ములు కోలుకోవాలని వనదేవతలకు మొక్కుకున్నారు. రెండుసార్లు ఎత్తు బంగారం సమర్పించారు. ఆ మొక్కు ఫలించి అమ్ములు కోలుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకపోయాయి.
ఆరోగ్యం క్షీణించి.. తుదిశ్వాస విడిచి..
అమ్ములు వయసు మీద పడింది. నెలరోజుల క్రితం పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. లక్ష్మి–మల్లేశం దంపతులు చిన్నపిల్లను చూసుకున్నట్లు ప్రతిరోజూ అన్నం తినిపించారు. మందులు వేశారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థంచారు. అయినా విధి కరుణించలేదు. బుధవారం ఉదయం అమ్ములు తుదిశ్వాస విడిచింది.
హిందూ సంప్రదాయంగా అంత్యక్రియలు
అమ్ములు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరు న విలపించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మూగజీవిపై చూపిన ప్రేమ, ఆప్యాయత, గౌరవం స్థానికులను కదిలించింది.
పిల్లలు అమెరికాలో.. అమ్ములు తోడుగా..
క్యాండిల్స్ తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న మల్లేశం–లక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ వివాహాల అనంతరం ఉద్యోగ రీ త్యా అమెరికాలో స్థిరపడ్డారు. పిల్లలు దూరంగా ఉండటంతో అమ్ములే తమకు ఓదార్పు, తోడు, ఆత్మీయతగా మారింది. ‘మా పిల్లలు దూరంలో ఉన్నా.. అమ్ములు మా పక్కనే ఉండేది. మా సంతోషాల్లోనూ, మా బాధల్లోనూ తోడుండేది. ఇప్పుడు ఇల్లు ఖాళీగా అనిపిస్తోంది. అమ్ములు లేనిలోటు ఎలా భర్తీ చేసుకోవాలో తెలియడం లేదు’ అని దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు.
కాశీలో కలుపనున్న అస్థికలు..
అమ్ములుతో తమ అనుబంధం మరణంతో ముగియదని భావిస్తున్న దంపతులు.. అస్థికలను భద్రపరుస్తామని తెలిపారు. అమ్ములు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ త్వరలో కాశీకి వెళ్లి గంగానదిలో అస్థికలను నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ‘మా కుటుంబ సభ్యురాలిగా జీవించిన అమ్ములకు చేయాల్సిన చివరి ధర్మం అదే..’ అని దంపతులు భావోద్వేగంగా తెలిపారు.


