వారాహి గుప్త నవరాత్రులంటే ఏమిటి? | Worship Of Goddess Varahi And Gupta Navaratrulu | Sakshi
Sakshi News home page

వారాహి గుప్త నవరాత్రులంటే ఏమిటి?

Jul 16 2026 8:09 AM | Updated on Jul 16 2026 8:20 AM

Worship Of Goddess Varahi And Gupta Navaratrulu

సన్నిధి

విశిష్టం

నేటి ఆధునిక సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ కలహాలు, అనారోగ్యం. వాటితోపాటు న్యాయపరమైన, ఆర్థిక పరమైన ఇబ్బందులు, శత్రు బాధలు సర్వసాధారణం అయిపోయాయి. ఇటువంటి సమస్యలు వారాహి దేవి ఆరాధనతో తొలగిపోతాయని, ముఖ్యంగా వారాహి దేవిని ఆరాధిస్తే శత్రు బాధలు తొలగిపోతాయని, మన ససమ్యలన్నింటికీ అమ్మ అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందనీ నమ్మకం. శక్తి దేవతల ఆరాధనకు ప్రసిద్ధి చెందిన విశిష్టమైన కాలం ఆషాఢ నవరాత్రులు. ఈ ఏడాది వారాహి గుప్త నవరాత్రులు బుధవారంప్రారంభం అయ్యాయి. ఈ నవరాత్రుల్లో ఆచరించాల్సిన విధివిధానాలేమిటో తెలుసుకుందాం.

తెలుగు పంచాంగం ప్రకారం వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి, నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది జూలై 15, బుధవారం ప్రారంభమయ్యాయి. 23, గురువారం వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ పవిత్ర దినాలలో శ్రీ వారాహి అమ్మని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మ అనుగ్రహంతో కష్టాలనుంచి, చిక్కుల నుంచి బయట పడవచ్చునని శక్తి ఉపాసకులు చెబుతారు.

గుప్త నవరాత్రులంటే ఏమిటి? 
’గుప్త’ అంటే రహస్యం. ఈ నవరాత్రులలో అమ్మవారిని రహస్యంగా, నిష్టతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులని కూడా అంటారు.

వారాహి దేవి ఎవరు?
లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు. సప్త మాతృకలలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు అత్యంత శక్తిమంతమైన రూపం. ఈమె పరమేశ్వరుడి అనుగ్రహంతో అంధకాసుర సంహారం కోసం అవతరించినట్లు దేవీ పురాణం చెబుతోంది.

పూజా విధానం
వారాహి గుప్త నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య వారాహి దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని దేవి పురాణం చెబుతోంది. సూర్యాస్తమయం తరువాత శుచిగా స్నానం ఆచరించి అమ్మవారి రూపాన్ని ప్రతిష్టించి మనసులో సంకల్పం చెప్పుకుని 9 రోజుల దీక్ష తీసుకోవాలి. వారాహి అమ్మ వారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై 
ప్రతిష్టించాలి.

నైవేద్యాలు... దాన ధర్మాలు
ప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయాలి. అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనస్సుతో వారాహి మూల మంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూప దీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతారు.

పూజాఫలం ఏమిటి? 
భక్తిశ్రద్ధలతో వారాహి గుప్త నవరాత్రుల వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు, వారాహి దేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివద్ధి కలిగి, సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయ కేతనం ఎగుర వేయాలంటే వారాహి దేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెబుతున్నారు.

రూపం ఉగ్రం... మానసం శాంతం
వారాహి దేవి ఉగ్రంగా కనబడినప్పటికి తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ఈ ఆషాఢంలో వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రు పీడలు ఉండవని భక్తుల విశ్వాసం.

క్షేత్ర పాలికగా వారాహీ దేవి
సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్ర పాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులు శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవీ ఉపాసకులు అంటారు.

ఈ వారాహి నవరాత్రులలో మనం కూడా వారాహి దేవిని 9 రోజులపాటు పూజించి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు పొందుదాం.
– ఎం. శ్రీకాంత్‌ శర్మ, హిందూ ధర్మచక్రం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement