మన(సు)లో మాట
నేను ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో మెడిసిన్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీకి అసాధారణమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఆయనంటే నాకు చాలా గౌరవం, అభిమానం. ఆయనకు సుమారు 50 ఏళ్లుంటాయి. ఆయనకు గతంలో పెళ్లయింది కానీ కొన్ని కారణాల వల్ల భార్యతో విడిపోయి ఒంటరిగానే ఉంటున్నారు. ఇది తెలిసి ఆయన పట్ల నాకు ఉన్న అభిమానం కాస్తా ప్రేమగా మారింది. నేను నా మనసులోని విషయాన్ని ఆయనకు చెప్పి, పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తపరిచాను. అయితే ఆయన చాలా సున్నితంగా నా ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ విషయం నా స్నేహితులకు తెలిసింది. అప్పటినుంచి వారు నన్ను వింతగా... జాలిగా చూస్తూ ‘నువ్వు ఒకసారి సైకియాట్రిస్టును కలవాలి’ అని అంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నిజంగానే సైకియాట్రిస్టును కలవాల్సిన అవసరం ఉందా? దయచేసి సలహా ఇవ్వండి.
– మధురిమ, బెంగళూరు
మెడికల్ కాలేజీల్లో గానీ లేదా ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో గానీ తమ సీనియర్లను, ఫ్యాకల్టీని ఆరాధించడం లేదా అభిమానించడం అనేది సర్వసాధారణం. దీనినే వైద్యపరిభాషలో ’మెంటర్ వర్షిప్’ అంటారు. అయితే మీ విషయంలో ఆ అభిమానం ఒక అడుగు ముందుకేసి ప్రేమగా మారింది, ఇలా జరగడమూ సహజమే. కానీ మీరు మరో అడుగు ముందుకేసి మీ ప్రేమను మీ గురువుగారికి వ్యక్తపరిచారు. ఆయన తన పరిణతితో, సమాజంలో తనకున్న బాధ్యతలు, హద్దుల గురించి ఆలోచించి సున్నితంగా ‘కాదు’ అని చెప్పి ఉంటారు. ఒకసారి ఆయన నిర్ణయం చెప్పిన తర్వాత, ఒక గురువుగా ఆయన గౌరవాన్ని కాపాడాలి. అంతేగానీ ’ఏదో ఒక రకంగా నేను ఆయన్ని సాధించాలి’ అని అనుకోవడం సరికాదు. మీ దృష్టిలో అది ప్రేమే కావచ్చు కానీ ఒక పరిధి దాటిన తర్వాత అది ‘అబ్సెషన్’గా మారిపోతుంది. అలాంటి అబ్సెషన్ ను చూసే బహుశా మీ స్నేహితులు మిమ్మల్ని ఒకసారి సైకియాట్రిస్ట్‌ను కలవమని సలహా ఇచ్చి ఉంటారు.
ఒక వ్యక్తిని వృత్తిపరంగా ఆరాధించడం వేరు, వారితోపాటు జీవితాన్ని పంచుకోవడం వేరు... ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలు. మీరు ఇప్పుడే కెరీర్‌లో పీక్ స్టేజ్‌లోకి అడుగుపెడుతున్నారు. పైగా మీ ఇద్దరికీ వయోభేదం చాలా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన అభి్రపాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ పరిస్థితి నుంచి తొందరగా బయటపడి మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తే మంచిది. ఒకవేళ మీరతన్ని నిజంగా అభిమానిస్తే, ఆయనలాగే ఒక మంచి ఫిజీషియన్ కావడానికి ప్రయత్నించండి. భవిష్యత్తులో మీకు ఆయనలాగే అద్భుతమైన క్లినికల్ స్కిల్స్ ఉన్న ఈడుజోడు కలిగిన అబ్బాయి దొరకడని చెప్పలేం కదా? రేపు అలాంటి వ్యక్తిని మీరు వివాహం చేసుకోవచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి... ఆకాశంలో మెరిసే నక్షత్రాన్ని చూసి మనం మురిసిపోవాలి కానీ, దాన్ని తెచ్చి ఇంట్లో దీపంలా పెట్టుకోవాలనుకోకూడదు. మీ గురువుగారిని చూడండి, ఆరాధించండి, ఆయనలా అవడానికి ప్రయత్నించండి, అంతేగానీ ఆయనను మీ జీవితంలోకి శాశ్వతంగా తెచ్చుకోవాలని అనుకోవద్దు. ఈ తాత్కాలిక భ్రమ నుండి బయటపడటానికి, ఆలోచనలను రీ–డైరెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి సైకియాట్రిస్టును, క్లినికల్ సైకాలజిస్ట్‌ని కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి.

డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com


