డిగ్రీ అధ్యాపకుల బదిలీలపై కాలయాపన! | Delay in transfers of degree faculty members | Sakshi
Sakshi News home page

డిగ్రీ అధ్యాపకుల బదిలీలపై కాలయాపన!

Apr 18 2026 5:34 AM | Updated on Apr 18 2026 5:34 AM

Delay in transfers of degree faculty members

గత ఏడాది అన్ని శాఖల్లో జరిగినా వీరికి మొండిచెయ్యి 

ఎయిడెడ్‌ నుంచి ప్రభుత్వంలోకి విలీనమైన పోస్టులకు సర్వీసు రూల్స్‌ లేవనే సాకుతో బ్రేక్‌ 

ఏడాదికిపైగా సర్వీసు రూల్స్‌ రూపకల్పనలో ప్రభుత్వం విఫలం 

ఈ ఏడాది కూడా బదిలీలు లేకుండా చేసేందుకు కుట్ర

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని అధ్యాపకుల బదిలీలపై గందరగోళం నెలకొంది. న్యాయబద్ధంగా, అధ్యాపకుల హక్కుగా చేపట్టాల్సిన ఈ ప్రక్రియను ప్రభుత్వం కుట్రలతో మోకాలడ్డుతోంది. గతేడాది అన్ని ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీలు చేసిన ప్రభుత్వం కళాశాల విద్యాశాఖను నిర్లక్ష్యం చేసింది. దీనికి ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్‌ అధ్యాపకులకు సర్వీసు రూల్స్‌ లేవనే నెపంతో అప్పట్లో బదిలీలకు మంగళం పాడేసింది. ఇలా ఏడాదిపాటు కాలయాపన చేసిన చంద్రబాబు సర్కారు రూల్స్‌ను రూపొందించడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా వేలాది మంది అధ్యాపకుల బదిలీలకు బ్రేకులుపడ్డాయి. 

ఎయిడెడ్‌ అధ్యాపకులపై నిర్లక్ష్యం... 
రాష్ట్రంలోని 170కి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాలుగు వేలకుపైగా శాంక్షన్డ్‌ పోస్టులుంటే 50 శాతం పోస్టులు నాన్‌ రెగ్యులర్‌ అధ్యాపకులతోనే నడుస్తున్నాయి. మొత్తం డిగ్రీ కళాశాలల్లో 1,900 మంది వరకు రెగ్యులర్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇందులో ఎయిడెడ్‌ నుంచి ప్రభుత్వంలోకి విలీనమైన వారు 600 మందికిపైగా ఉన్నారు. వీరితో పాటు కాంట్రాక్టు పద్ధతిలో మరో 600 మంది, అతిథి అధ్యాపకులు మరో వెయ్యి మందితో బోధన సాగిస్తున్నారు. 

గతంలో చాలా ఎయిడెడ్‌ కళాశాలలు ప్రభు­­త్వంలో విలీనం అయ్యాయి. ఆ తర్వాత వాటికి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం కల్పించినప్పుడు కళాశాలలు మాత్రమే ఎయిడెడ్‌కు వెళ్లగా, వాటిల్లోని చాలామంది అధ్యాపకులు ప్రభుత్వంలోనే కొనసాగించాలని కోర్టు స్టే తెచ్చుకున్నారు. అయితే, వీరిని బదిలీల్లోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. సుమారు 200 మందికి మాత్రమే పూర్తిస్థాయి కళాశాలలతో పాటు పోస్టులు విలీనమై పనిచేస్తున్నారు. 

ఇలా ఎయిడెడ్‌ నుంచి వచ్చిన అధ్యాపకులకు సర్వీసు రూల్స్‌ను రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తొలుత ‘జీరో’ సర్వీసు ఇస్తామని ప్రకటించినా స్పష్టమైన ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. ఇప్పుడు సర్వీసు రూల్స్‌ దస్త్రం ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నా దానిని కావాలనే చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలున్నాయి.  

మెడికల్‌ గ్రౌండ్‌ బదిలీలూ లేనట్లేనా? 
2021లో రిక్రూట్‌ అయిన అధ్యాపకులు చాలామంది కుటుంబాలకు దూరంగా, సుదూర ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. దీనితోపాటు గత కొన్నేళ్లుగా ఒకేచోట సర్వీసులో ఉంటూ కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చాలామంది బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, కేవలం ఎయిడెడ్‌ నుంచి వచి్చన అధ్యాపకులకు సర్వీసు రూల్స్‌ లేవని, అందుకు బదిలీలు చేపట్టలేదని ప్రకటించడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని బట్టబయలు చేసింది. 

దీంతోపాటు ఏటా సాధారణంగా స్పౌజ్, మెడికల్‌ గ్రౌండ్స్‌లో బదిలీ­లకు అధ్యాపకులు దరఖాస్తు చేసుకుంటారు. వాటిని పరిశీలించి ప్రభుత్వం బదిలీలు చేస్తుంది. రెండేళ్లుగా ఈ విధానాన్ని సైతం తుంగలో తొక్కి అధ్యాపకులను తీవ్రంగా వేధిస్తోంది. గత ఏడాది ఉద్యమానికి సిద్ధమైన డిగ్రీ అధ్యాపకులకు బదిలీలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గి తీవ్రంగా మోస­పోయారు. ఈ ఏడాది బదిలీలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రాలు అందిస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement