సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ బ్రాంచ్‌లో వెలుగుచూసిన మత మార్పిడి కేసులో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుల మొబైల్ ఫోన్ల నుండి లభించిన రెండేళ్ల నాటి ఒక ఫోటో ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. బాధితులను ఒక క్రమపద్ధతిలో మతమార్పిడికి ఎలా ప్రలోభ పెట్టారో, ఆకర్షించారో ఈ చిత్రం ఒక అరుదైన సాక్ష్యమని, కొనసాగుతున్న దర్యాప్తులో కీలకమైన కొత్త కోణాన్ని తెరిచిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
సాక్ష్యంగా ఫోటో
తనిఖీల్లో భాగంగా పోలీసులకు లభించిన ఒక ఫోటోలో, ఈ కేసులో ప్రధాన నిందితుడైన తౌసిఫ్ అత్తార్ పక్కన తెల్లటి టోపీ ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. మొదట్లో అతను మరో నిందితుడని పోలీసులు భావించారు. కానీ అత్తార్‌ను మరింత విచారించగా, అప్పటికే మత మార్పిడికి గురైన, టీసీఎస్‌కు చెందిన సహోద్యోగి గోపాల్ (పేరు మార్పు) అని తేలింది. మత మార్పిడి తర్వాత అతను తన పేరును 'గుల్షన్'గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో బాధితుడు దుస్తులు మార్చుకుని, మతపరమైన ఆచారాలలో పాల్గొంటున్నట్లు కనిపిస్తోందని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.
బాధితుడు చెప్పిన సంచలన విషయాలు
పోలీసులు సదరు బాధితుడిని విచారించగా, అతన్ని ఎలా ప్రలోభపెట్టారో వివరిస్తూ సంచలన విషయాలు వెల్లడించాడు. 2023 మార్చిలో బాధితుడి తండ్రికి పక్షవాతం రావడంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండవాడు. తోటి ఉద్యోగులు అతని పరిస్థితిని ఆసరాగా చేసుకుని మతం గురించి ప్రబోధించడం మొదలు పెట్టారు. బాధితుడి సొంత మతం సరైనది కాదని, వారి మత పద్ధతులను పాటిస్తేనే సమస్యలు తీరుతాయని నమ్మబలికారు.
ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్
ఇందుకు సంబంధించి అనేక వీడియోలను కూడా అతనికి పంపారు. మత గ్రంథాలను పఠించడంతో సహా కొత్త ఆచారాలను పాటించేలా వారిని క్రమంగా ప్రేరేపించారు. మతం మారమని, పేరు మార్చుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. బాధితుడు వ్యతిరేకించినా, బలవంతంగా కొన్ని మతపరమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ఆచారాలు చేయించారని సమాచారం. బాధితుడి మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అతని కుటుంబ సభ్యుల భద్రతపై కూడా భయాందోళనలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
ఈ ఫోటో బాధితుడి వాంగ్మూలం ద్వారా, వర్క్‌ప్లేస్‌లో ఉద్యోగులను ఎలా టార్గెట్ చేస్తున్నారు, క్రమ పద్ధతిలో మత మార్పిడికి పాల్పడుతున్నారో అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. నిందితుల ఫోన్ల నుండి సేకరించిన డిజిటల్ సాక్ష్యాలు, వీడియోలు సందేశాలను పోలీసులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఈ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం


