న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఉదయం 11.30 గంటలకు సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించడంతో పాటు సమావేశంలో పలు ‘కీలక నిర్ణయాలు’ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని పలు జాతీయ ఛానళ్లు, వార్తా సంస్థలు కథనాలు వెలువరించాయి.
దాంతో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలపై ఆర్డినెన్స్ తేవడం వంటి చర్యలు ఉండొచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు వంటి పలు కీలక నిర్ణయాలను మోదీ సర్కారు ఇలాంటి అత్యవసర కేబినెట్ సమావేశాల్లోనే తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాటి భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సమావేశ ఎజెండాను కేంద్రం వెల్లడించలేదు.
ఎన్డీయే నేతల సమీక్ష: మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోవడానికి దారితీసిన కారణాలపై అధికార ఎన్డీయే కూటమి సమీక్ష చేపట్టింది. శుక్రవారం రాత్రి లోక్‌సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్డీఏ పక్షాల పార్లమెంటరీ పార్టీ నేతలు సమావేశమయ్యారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్‌రాం మేఘ్వాల్‌తో పాటు లలన్‌సింగ్ (జేడీ–యూ), జయంత్ చౌదరి (ఆరెల్పీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేజీ–ఆర్‌వీ), కింజరాపు రామ్మోహన్‌నాయుడు (టీడీపీ) తదితరులు వారిలో ఉన్నారు.


