వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహాయంతో ఇరాన్ జలమార్గం నుండి సముద్ర మైన్‌లను తొలగిస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మైన్‌లను తొలగించడానికి అమెరికా, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్ అన్నారు.
ఇక, అమెరికా నేవీ ఇప్పటికే ఒక లిట్టోరల్ కాంబాట్ షిప్‌ను మైన్ క్లియరింగ్ ఆపరేషన్ల కోసం అక్కడ ఉంచారు. అలాగే, అదనంగా జపాన్ నుంచి రెండు మైన్ క్లియరింగ్ నౌకలు కూడా ఆ ప్రాంతానికి బయలుదేరాయి. అయితే, యుద్ధం నేపథ్యంలో హార్మూజ్‌లో చిన్న పడవల సాయంతో ఇరాన్ మైన్లను అమర్చింది. కాగా.. గత వారం న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, హార్మూజ్‌లో ఇరాన్ వేసిన అన్ని మైన్స్‌ను గుర్తించడం కష్టంగా మారింది. కొన్ని మైన్స్.. నీటి ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు తెలిపింది. దీంతో, నీటి నుంచి మైన్స్‌ను తీయడం కష్టంగా మారిందని పేర్కొంది.
మరోవైపు.. బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలకు హార్మూజ్ జలసంధిలో ఉన్న మైన్లను తొలగించే సామర్థ్యం ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి కేథరీన్ వాట్రిన్ వెల్లడించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకలకు ఐరోపా దేశాలు పూర్తి మద్దతుతో కూడిన ఎస్కార్ట్ సేవలను అందించగలవని వాట్రిన్ తెలిపారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, కీలకమైన నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సహా ఇతర ప్రపంచ నాయకులు సమావేశం కానున్నారు.
సమావేశానికి మాక్రాన్, స్టార్మర్ నాయకత్వం
మరోవైపు ఇరాన్‌పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ చర్చలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
సుమారు 40 దేశాల నాయకులు హాజరు
కాగా మాక్రాన్‌తో కలిసి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పారిస్‌కు చేరుకోనున్నారు. అలాగే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని కూడా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతర ప్రపంచ నేతలు వర్చువల్‌గా ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం. ఇరాన్‌తో కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వడం, కీలకమైన సముద్ర మార్గం గుండా సురక్షిత ప్రయాణం లక్ష్యంగా సుమారు 40 దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని అంతర్జాతీయ మీడియా CNN పేర్కొంది. అయితే, ఆ జాబితాను ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు, సిబ్బంది భద్రతను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ (International Maritime Organization) చేస్తున్న పనికి మద్దతు ఇవ్వడంపై కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని పేర్కొంది.


