‘గుర్తింపు’ గండం! | Intermediate students anxious in Telangana | Sakshi
Sakshi News home page

‘గుర్తింపు’ గండం!

Jun 22 2026 6:13 AM | Updated on Jun 22 2026 6:13 AM

Intermediate students anxious in Telangana

డోలాయమానంలో 5 లక్షల ఇంటర్‌ విద్యార్థులు

అనుబంధ గుర్తింపు లేకున్నా.. ప్రైవేటు కాలేజీల్లో జోరుగా ప్రవేశాలు

మే నెలాఖరుతోనే ముగిసిన అఫ్లియేషన్ల గడువు

తనిఖీల నివేదికలు ఇచ్చామంటున్న జిల్లా అధికారులు

బోర్డు బృందాలు మళ్లీ తనిఖీ చేయాల్సిందేనంటున్న కార్యదర్శి

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్‌ గాలిలో ఊగిసలాడుతోంది. కాలేజీల్లో చేరినా వాటికి గుర్తింపు ఉందా? లేదా? అన్న డోలాయమానంలో పడిపోయారు. అన్ని జిల్లాల్లో ఈ అయోమయం నెలకొన్నా ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏమాత్రం చలించడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 3,400 జూనియర్‌ కాలేజీలున్నాయి. ప్రైవేటు రంగంలో 1400. ప్రభుత్వ రంగంలో ఉన్న 800 కాలేజీలకు బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. 

ప్రైవేటు రంగంలో ఉన్న వాటిల్లో కేవలం 209కి మాత్రమే బోర్డు గుర్తింపు వచ్చింది. వెయ్యికి పైగా కాలేజీలకు అఫ్లియేషన్‌ ఎందుకు ఆపారో బోర్డు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే ‘చూస్తాం... ఇస్తాం... చేస్తాం...’ అంటూ దాటవేస్తున్నారు. అనుబంధ గుర్తింపును ఏప్రిల్‌ నాటికే పూర్తి చేస్తామని గతంలో అధికారులు చెప్పారు. ఇంటర్‌ షెడ్యూల్‌ ప్రకారం చూసినా మే నెలాఖరుకే గుర్తింపు ఇవ్వాలి. ప్రైవేటు కాలేజీలను తనిఖీలు చేసి, నివేదికలను బోర్డుకు పంపామని జిల్లా అధికారులు కూడా చెబుతున్నారు. ప్రైవేటువే కాదు కొన్ని మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, సంక్షేమ గురుకులాలకు కూడా బోర్డు అనుమతినివ్వలేదు. 

వాటిని ధ్రువీకరించేదెవరు?
ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కాలేజీలు అవసరమైన ధ్రువపత్రాలన్నీ సమర్పించాయి. అగ్నిమాపకశాఖ, శానిటేషన్, ట్రాఫిక్, భవన పటిష్టత వంటి పత్రాలను బోర్డుకు ఇచ్చాయి. వీటన్నింటినీ అధికారులు స్వయంగా పరిశీలించాలని ఇంటర్‌ కార్యదర్శి భావిస్తున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయి అధికారులు కాలేజీలతో కుమ్మక్కై వాటిని ధ్రువీకరించారనేది కార్యదర్శి అనుమానం. వాస్తవానికి బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే కాలేజీలకు అగ్నిమాపక శాఖ ఎప్పట్నుంచో అనుమతి ఇవ్వొద్దని చెబుతోంది. పరీక్షలు దగ్గరపడే వరకూ అనుమతులూ ఇవ్వడం లేదు. ఆఖర్లో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అఫ్లియేషన్‌ ఇస్తున్నట్టు చెబుతున్నాయి.  

అఫ్లియేషన్‌ లేకున్నా అడ్మిషన్లు
అనుబంధ గుర్తింపు లేకున్నా అన్ని కాలేజీలూ పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకున్నాయి. రూ. 80వేల నుంచి రూ. 4 లక్షల వరకూ వార్షిక ఫీజు దండుకున్నాయి. జూన్‌ 1 నుంచే క్లాసులు మొదలు పెట్టాయి. అయినా అధికారులు గుర్తింపులేని కాలేజీలను అడ్డుకునే సాహసం చేయడం లేదు. గుర్తింపు లేని కాలేజీల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది చేరారు. గుర్తింపు ఉంటే తప్ప వీళ్లు వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉండదు. లేదంటే ప్రైవేటుగా పరీక్షలు రాయాలి. ఇంకోవైపు కార్పొరేట్‌ కాలేజీల మాయాజాలం యథాతథంగా సాగుతోంది. గుర్తింపు ఉన్న బ్రాంచీల్లో విద్యార్థుల ప్రవేశాలు చూపిస్తున్నారు.

ఉదాహరణకు హైదరాబాద్‌ బ్రాంచీలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య నిండినా చేర్చుకుంటున్నారు. వారి ప్రవేశాలను వరంగల్, ఖమ్మం లేదా ఆదిలాబాద్‌ బ్రాంచీల్లో చూపిస్తున్నారు. అక్కడ ప్రవేశాలు లేకపోవడమే వారికి కలిసి వస్తోంది. పెద్ద కాలేజీలు ఇంత బాహాటంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోని అధికారులు తమకు మాత్రం అఫ్లియేషన్లు ఇవ్వకుండా వేధించడం ఏమిటని కొన్ని కాలేజీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇంటర్‌ అధికారుల వివరణ కోరేందుకు యత్నించగా వారు స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement