ఖమ్మం జిల్లా: అసలే అర్హతలు లేని వైద్యం.. ఆపై ఆర్‌ఎంపీగా చెలామణి అవుతున్న సదరు వ్యక్తి మద్యం మత్తులో వైద్యం చేసి అభంశుభం తెలియని బాలిక ప్రాణాలు బలిగొన్నాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... బస్వాపురం గ్రామానికి చెందిన చల్లా రమేష్, మౌనిక దంపతులకు కుమార్తె హిమశ్రీ(16) స్థానిక కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతుండగా..
ఆదివారం బోనాల పండుగ కావడంతో ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే స్వల్పంగా జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమెను స్థానిక ఆర్‌ఎంపీ మారుతి సంపత్ వద్దకు తండ్రి తీసుకెళ్లగా అప్పటికే మత్తులో ఉన్న ఆర్‌ఎంపీ ఆమెకు ఓ ఇంజక్షన్ ఇచ్చాడు. మరో ఇంజక్షన్ ఇస్తుండగా హిమశ్రీ నోటి నుంచి నురగలు కక్కుతూ కళ్లు తిరుగుతున్నాయని చెప్పి స్పృహ కోల్పోయింది.
ఈ మేరకు సంపత్ ఆటో పిలిపించి బాలికకు సీరియస్‌గా ఉందని ఖమ్మం తీసుకెళ్లాలంటూ తండ్రిని ఎక్కించుకుని బయలుదేరాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేక ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందిందని ఆమె బంధువులు ఆçస్పత్రి ఎదుట ఆందోళన చేయగా పోలీసులు నచ్చచెప్పి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బాలిక తండ్రి రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కొణిజర్ల ఎస్సై సూరజ్ తెలిపారు.


