పంజగుట్ట.. ఖననం చేసిన శిశువు మృతదేహం మాయం? | Infant dead body Missing in panjagutta | Sakshi
Sakshi News home page

పంజగుట్ట.. ఖననం చేసిన శిశువు మృతదేహం మాయం?

Aug 11 2026 7:13 AM | Updated on Aug 11 2026 7:13 AM

Infant dead body Missing in panjagutta

బంజారాహిల్స్‌: కవలలుగా కళ్లు తెరిచారు. ఒకరోజు వ్యవధిలో ఇద్దరు శిశువులు కన్నుమూశారు. పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో పాతిపెట్టిన మొదటి శిశువు మృతదేహం కనిపించకపోవడం కలకలం రేపుతోంది. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. కోల్‌కతాకు చెందిన రాజు మండల్, పూజ దంపతులు పాతబస్తీలోని గాందీబజార్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం పూజ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చారు. 

ఆరు నెలలకే ప్రీమెచ్యూర్‌ డెలివరీ కావడంతో శిశువులను వైద్యులు ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆదివారం తెల్లవారుజామున ఒక శిశువు ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. కుటుంబసభ్యులు శిశువు మృతదేహాన్ని పంజగుట్ట శ్మశానవాటికకు తీసుకువచ్చి ఖననం చేశారు. ఇందుకోసం అక్కడి సిబ్బందికి రూ.2,500 చెల్లించారు. కాగా, సోమవారం తెల్లవారుజామున రెండోశిశువు కూడా మృతి చెందింది. మొదటి శిశువు సమాధి పక్కనే ఖననం చేసేందుకు రెండోశిశువు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువచ్చారు. 

మొదటి శిశువు సమాధి కనిపించకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించగా తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు. సమాధిని తవ్వి చూడగా శిశువు మృతదేహం కనిపించలేదు. కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. శిశువు మృతదేహం మాయమైన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాజు మండల్‌ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్మశానవాటికలోని కొంతమంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నట్లు సమాచారం. శిశువు మృతదేహం ఎలా మాయమైంది? ఎవరు తీసుకెళ్లారు? ఇందులో శ్మశానవాటిక సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement