చిన్నారుల గుండెకు రక్ష | Free heart surgeries at NIMS Hospital | Sakshi
Sakshi News home page

చిన్నారుల గుండెకు రక్ష

Aug 11 2026 4:40 AM | Updated on Aug 11 2026 4:40 AM

Free heart surgeries at NIMS Hospital

నిమ్స్‌లో ఉచిత గుండె ఆపరేషన్లు

పుట్టుకతో గుండె వ్యాధులతో బాధపడుతున్నవారికి శస్త్రచికిత్సలు 

13 నుంచి ప్రత్యేక వైద్య శిబిరం.. వాక్‌–ఇన్‌ విధానంలో పరిశీలన 

బ్రిటన్‌ వైద్యుల సహకారంతో ఆపరేషన్లు.. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మొత్తం ఖర్చు భారం రాష్ట్ర ప్రభుత్వానిదే

లక్డీకాపూల్‌: గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు తీపి కబురు చెప్పింది నిమ్స్‌ ఆస్పత్రి. పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు చికిత్స అందించడానికి హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) ముందుకు వచ్చింది. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిమ్స్‌ తన వార్షిక సోషల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలను అందించనుంది. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు పూర్తిగా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాహుల్‌ దేవ్‌ రాజ్‌ తెలిపారు. నిమ్స్‌ కార్డియో థొరాసిక్‌ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొ.అమరేశ్వర్‌ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డా.రమణ దన్నపనేని, ఇతర సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో ఈ ప్రత్యేక శస్త్రచికిత్సలను ఈ నెల13వ తేదీ నుంచి చేపట్టనున్నామని పేర్కొన్నారు. 

అవసరాన్ని బట్టి చికిత్సలు.. 
అవసరాన్ని బట్టి ప్రాధాన్యత కేటాయిస్తూ వాక్‌–ఇన్‌ విధానంలో చిన్నారులను పరిశీలిస్తామని డైరెక్టర్‌ రాహుల్‌ తెలిపారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శస్త్రచికిత్సలకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా భరిస్తోందన్నారు. తల్లిదండ్రులకు ఒక్క రూపాయి భారం పడదని, వివరాలు, ఇతర సమాచారం కోసం నిమ్స్‌ పాత భవనంలోని సీటీ సర్జరీ కార్యాలయంలో డాక్టర్‌. ప్రవీణ్, డా.గోపాల్‌లను సంప్రదించాల్సిందిగా కోరారు. 

సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సంప్రదించవచ్చన్నారు. అర్హత ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్‌ అవసరం లేకుండా, నిర్ణీత సమయాల్లో నిమ్స్‌కు నేరుగా వచ్చి సంప్రదించవచ్చని చెప్పారు. ఆ సమయంలో అందుబాటులో ఉంటే గతంలో చేయించిన వైద్య పరీక్షలు, పాత వైద్య నివేదికలను తీసుకురావాలన్నారు. దీంతో వైద్యులు గత వైద్య చరిత్ర పరిశీలిస్తారని, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కూడా అంచనా వేస్తారని తెలిపారు. వైద్యులు చిన్నారులను చూసిన తర్వాత ఆపరేషన్‌ అవసరం, అత్యవసరమనేది ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ముందుకెళ్తామని డైరెక్టర్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement