వరద నీటిలో ‘ఆట’లొద్దు | Another health threat due to rains and floods during the monsoon | Sakshi
Sakshi News home page

వరద నీటిలో ‘ఆట’లొద్దు

Aug 11 2026 4:16 AM | Updated on Aug 11 2026 4:16 AM

Another health threat due to rains and floods during the monsoon

‘లెప్టోస్పిరోసిస్‌’ అనే వ్యాధి బారిన పడే అవకాశం

రాష్ట్రంలో రెండేళ్లలో 125 రెట్లు పెరిగిన కేసులు 

2023లో 2.. 2025లో 249.. ఈ ఏడాది జూన్‌ నాటికే 101 

ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటితో వ్యాధి వ్యాప్తి 

జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగీతోపాటు లెప్టోస్పిరోసిస్‌పైనా దృష్టిపెట్టాలి

సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాలంలో కురిసే వానలు, వరదలతో మరో అనారోగ్య ముప్పు పొంచి ఉంది. వరద నీటిలో ఆట లాడినా, తిరిగినా, కాళ్లు నానినా.... ‘లెప్టోస్పిరోసిస్‌’ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.  గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ వ్యాధి నుంచి ముప్పు అధికంగా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో లెప్టోస్పిరోసిస్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. 2023లో రాష్ట్రంలో కేవలం రెండు కేసులు నమోదవగా.. 2025లో ఆ సంఖ్య 249కి చేరింది. అంటే రెండేళ్లలో 125 రెట్లు పెరిగింది. ఈ ఏడాది జూన్‌ నాటికే 101 కేసులు నమోదయ్యాయి. వర్షాకాల వ్యాధులపై ఇటీవల రాజ్యసభలో సమర్పించిన గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలో కేసుల సంఖ్య పరంగా కేరళ 4,001 కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు (2,862), కర్ణాటక (2,302), మహారాష్ట్ర (2,184) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే కేసుల పెరుగుదల శాతంలో తెలంగాణ ముందుంది. 

ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటితో.. 
లెప్టోస్పిరోసిస్‌ అనేది బ్యాక్టీరియా వ్యాధి. ముఖ్యంగా ఎలుకలు, కొన్ని ఇతర జంతువుల మూత్రం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాటి మూత్రంతో కలుషితమైన నీరు, మట్టి మనుషుల చర్మానికి తగిలినప్పుడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. చర్మంపై గాయాలు, చిన్న పగుళ్లు ఉంటే ముప్పు మరింత పెరుగుతుంది. కళ్లు, ముక్కు, నోటి ద్వారా కూడా బ్యాక్టీరియా శరీరంలోకి చేరవచ్చు. హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు నెలకు సగటున 10 నుంచి 15 లెప్టోస్పిరోసిస్‌ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అకాల వర్షాలు, పట్టణ ప్రాంతాల్లో వరదలు, నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం, కలుషిత నీటికి ప్రజలు ఎక్కువగా గురికావడం, ఎలుకల సంఖ్య పెరగడం, పారిశుద్ధ్య లోపాలు వ్యాధి వ్యాప్తికి కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు.  

డెంగీ అనుకుని పొరబడొద్దు 
లెప్టోస్పిరోసిస్‌ ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్‌ జ్వరం, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులను పోలి ఉంటాయి. అకస్మాత్తుగా జ్వరం, చలి, తీవ్రమైన కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, నీరసం, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వరద నీటిలో నడిచిన తర్వాత జ్వరం వస్తే లెప్టోస్పిరోసిస్‌ అని అనుమానించాల్సిన అవసరం ఉంది. వ్యాధి తీవ్రత పెరిగితే మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, కాలేయ వైఫల్యం, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడు పొరల వాపు, కామెర్లు వంటి తీవ్ర సమస్యలు తలెత్తవచ్చు. చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో సకాలంలో యాంటీబయాటిక్స్‌ ప్రారంభిస్తే వ్యాధి తీవ్రత, సమస్యల ముప్పును తగ్గించవచ్చు. 

వరద నీటికి దూరంగా ఉండాలి 
ప్రజలు సాధ్యమైనంత వరకు నిలిచిపోయిన వరద నీటిలో నడవకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే బూట్లు, తొడుగులు వంటివి ధరించాలి. చేతులు, కాళ్లపై గాయాలు ఉంటే వాటిని నీరు చొరబడకుండా కప్పుకోవాలి. తర్వాత శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తాగునీరు కలుషితమైందనే అనుమానం ఉంటే కాచి లేదా శుద్ధి చేసి మాత్రమే వినియోగించాలి. ఇళ్లలో ఆహారాన్ని, చెత్తను మూతఉన్న పాత్రల్లో ఉంచి ఎలుకల నియంత్రణ చేపట్టాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement