ట్రెండ్ మారుతున్న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. అంచనాల కోసం ఆన్‌లైన్ సెర్చింగ్
కాలేజీల కటాఫ్ ఇట్టే తెలుసుకునే ఏర్పాటు
వచ్చిన ర్యాంకుకు సీటెక్కడో ఇట్టే పట్టేసే మంత్రం
టాప్ కాలేజీల ట్రెండింగ్‌కు సరికొత్త అప్లికేషన్స్
కన్సల్టెన్సీలకూ ఏఐ మంత్రమే శరణ్యం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ట్రెండ్ మారుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు విద్యార్థుల ఆలోచన విధానం పరుగులు పెడుతోంది. ర్యాంకు తెలిసిన ప్రతీ విద్యార్థి సీటు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఏఐ టూల్స్ ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. ఆప్షన్లపై మాక్ కౌన్సెలింగ్‌కు ఏఐ ఆధారిత నెట్ సైట్లకే లాగిన్ అవుతున్నారు. కన్సల్టెన్సీలు, ఏజెంట్లను ఆశ్రయించడం తగ్గిపోయింది. పైగా కన్సల్టెన్సీలు కూడా ఏఐ ఆధారిత ప్రిడిక్షన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఏఐ వాడకం పెరిగిన తర్వాత కన్సల్టెన్సీలకు వచ్చే విద్యార్థులు 40 శాతం తగ్గారని ప్రైవేటు కన్సల్టెంట్ సంజయ్ మిత్ర చెప్పారు. ర్యాంకును బట్టి ఏఐ ద్వారా సీటును అంచనా వేయడంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులూ ముందు వరుసలోనే ఉన్నారని తెలిపారు. తాము కూడా ఏఐ ఆధారిత అప్లికేషన్స్‌ను సమకూర్చుకోవాల్సి వచ్చిందని మరో కన్సల్టెంట్ శైలేష్ పల్లవ్ తెలిపారు.
అంచనాల దూకుడులో ఏఐ
ప్రతీ కాలేజీకి సంబంధించి గత కొన్నేళ్ల కటాఫ్ వివరాలు ఇప్పటికే క్లౌడ్ డేటాకు చేరాయి. ఏఐ ఆధారిత కసరత్తు రెండేళ్లుగా జరిగినట్టు ఎడ్యు డేటా సెంటర్‌కు చెందిన దిలీప్ మల్హోత్రా తెలిపారు. కౌన్సెలింగ్ ప్రిడిక్టర్స్, ర్యాంకు ఆధారిత కాలేజీ అవకాశాలు, బ్రాంచ్ వారీగా విశ్లేషణలు, ఏఐ ఆధారిత రికమండేషన్స్, కొన్నేళ్లుగా కటాఫ్ ఆధార అంచనాలతో కూడిన డేటా.. క్లౌడ్ సెంటర్ల నుంచి వేగంగా తెస్తున్నాయని, ఇందుకు సంబంధించి ఆధునిక అప్లికేషన్స్ నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయని హైదరాబాద్ క్లౌడ్ డేటా సెంటర్ ప్రాజెక్టు మేనేజర్ వినీత్ వస్లా తెలిపారు. ప్రారంభ, ముగింపు కటాఫ్ వివరాలను అన్ని కాలేజీల స్థాయిల్లో అందించేలా అప్లికేషన్స్ రూపొందించినట్టు చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు ర్యాంకు అంచనా కోసం వెతికే సమయం తగ్గిపోయిందన్నారు. ఐదు నుంచి పదేళ్ల కటాఫ్ వివరాలను కొన్ని అప్లికేషన్లు గ్రాఫిక్స్ రూపంలో అందిస్తున్నాయి. కాలేజీల ప్లేస్‌మెంట్ ట్రెండ్, ఫీజులు తదితర సమాచారం డేటా కేంద్రాల్లో నిక్షిప్తం చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. కొన్నేళ్ల బ్రాంచీల వారీగా డిమాండ్ వివరాలనూ ఏఐ మాడ్యూల్స్ ద్వారా తెలుసుకునే అవకాశాలు పెరిగినట్టు కేరీర్ కన్సల్టెన్సీకి చెందిన విక్రమ్ పొలంపల్లి తెలిపారు.
నెట్‌లో హల్‌చల్..
కన్వెన్షనల్ ఏఐ కౌన్సెలర్లు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇవి చాట్ జీపీటీ తరహాలో పనిచేస్తున్నాయి. ‘నా ర్యాంకు ఇంత... నాకు సీఎస్‌ఈ సీటు కావాలి.. హైదరాబాద్‌లో ఏ కాలేజీలో వస్తుంది’ అని ఫీడ్ చేస్తే క్షణాల్లో సమాధానం వస్తుంది. కాలేజీల జాబితా, గత కటాఫ్, ఫీజులు, ప్లేస్‌మెంట్, ప్రత్యామ్నాయ బ్రాంచీలను ఏఐ సూచిస్తోంది. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌కు ఏఐ ట్యూటర్, కటాఫ్ ప్రిడిక్షన్, కెరీర్ గైడెన్స్ వంటి ఫీచర్లను కొత్తగా జోడించడం వల్ల ఫలితం వేగంగా వస్తోంది. అంతేకాదు... ఎంచుకునే కోర్సు డిమాండ్‌ను కూడా ఏఐ విశ్లేషిస్తోంది. కోర్... నాన్ కోర్... ఎమర్జింగ్ కోర్సుల్లో డిమాండ్... ఉద్యోగ అవకాశాలు.. ఐదేళ్లుగా బ్రాంచీకి ఉన్న డిమాండ్, ఉపాధి అవకాశాల వివరాలు అందుతున్నాయి. పర్సనలైజ్డ్ కౌన్సెలింగ్ డ్యాష్ బోర్డులూ చురుకుగా పనిచేస్తున్నాయి. విద్యార్థి ప్రొఫైల్, మాక్‌టెస్ట్ పనితీరు, ఇష్టమైన నగరాలు, ఫ్యామిలీ బడ్జెట్ వివరాలను ఈ డ్యాష్‌బోర్డ్ ద్వారా రూపొందిస్తున్నారని, భవిష్యత్‌లో ఇవి మరింత కీలకం అవుతాయని ఐటీ రంగ నిపుణుడు చరణ్ సంగుపాటి తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రాలు, కాలేజీలు కూడా వీటి ఆధారంగానే విద్యార్థులను యాజమాన్య కోటా వైపు మళ్లించే వీలుందని తెలిపారు.
ఈసారి సూపర్ ర్యాంక్ 5 వేలే..
ఏఐ అంచనాలన్నీ ఈ ఏడాది కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉంటుందనే చెబుతున్నాయి. ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సుల ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీఎస్‌ఈ కోర్సులకు ప్రధాన పది కాలేజీల్లో 5 వేల ర్యాంకు కటాఫ్‌గా ఉండే వీలుందని చెబుతున్నాయి. ఓయూ, జేఎన్‌టీయూహెచ్ వంటి క్యాంపస్‌లలో 3 వేల వరకూ కటాఫ్ ఉండే వీలుందని చెబుతున్నాయి. టాప్ కాలేజీలు, యూనివర్సిటీలకు ఇతర జిల్లాల్లో ఉండే కాలేజీల్లో ఎస్సీ కేటగిరీకి 10 నుంచి 16 వేల ర్యాంకు వరకూ సీఎస్‌ఈ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి. కంప్యూటర్ కోర్సుల తర్వాత ఈసీఈ కోర్సుకు రెండో ప్రాధాన్యత కన్పిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. టాప్ కాలేజీల్లో 8 వేల వరకూ, క్యాంపస్ కాలేజీల్లో 5 వేల వరకూ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి.


