కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో దారుణం చోటుచేసుకొంది. తప్పతాగిన ఇద్దరు నగరపాలకసంస్థ కంప్యూటర్ ఆపరేటర్లు, విధుల్లో ఉన్న ఓ మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను లైంగికవేధింపులకు గురిచేశారు. ఒక దశలో ఆమెను చుట్టుముట్టి నిర్మానుష్యప్రాంతానికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరపాలకసంస్థలోని ఓ విభాగంలో పనిచేస్తున్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్ సీతారాంపూర్ ప్రాంతంలో ఎస్‌ఐఆర్ విధులు చేపడుతున్నారు. ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం ఆమె విధుల్లో ఉండగా, అక్కడికి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు వచ్చారు.
ఆమెను చుట్టుముట్టి లైంగికవేధింపులకు దిగారు. ఒక దశలో నిర్మానుష్యప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా అక్కడ జనాలు ఉండడంతో వీలుపడలేదు. ఆమెను దుర్భాషలాడుతూ తమతో రావాలని, తమకు కంపెనీ ఇవ్వాలంటూ వేధించారు. దీంతో తాను కమిషనర్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తే, ఉన్నతాధికారులు అని కూడా చూడకుండా వారు ఏమీ చేయలేరంటూ దుర్భాషలాడారు. గట్టిగా హెచ్చరించడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా భర్త మరణంతో కారుణ్య ఉద్యోగం పొందిన ఆమెపై గత ఏడాదిన్నరగా వేధింపులు జరుగుతుండడం గమనార్హం. అప్పట్లోనే బాధిత మహిళ వేధింపులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా, సదరు కంప్యూటర్ ఆపరేటర్‌తో క్షమాపణ చెప్పించారు.
విచారణకు ఆదేశం
తనను వేధిస్తున్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లపై చర్యతీసుకోవాలని ఈ నెల 13వ తేదీన బాధిత ఆపరేటర్ నగరపాలకసంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చే సింది. కమిషనర్ విచారణకు ఆదేశించారు. బుధవా రం నగరపాలకసంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేపట్టింది.
నిందితులు తమకు రాజకీయ పలుకుబడి ఉందంటూ, తమను ఎవరూ ఏం చేయలేరంటూ బాధిత మహిళను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఇలానే రాజకీయ పలుకుబడితోనే బయటపడ్డారని, మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విధుల్లో ఉన్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు.


