తాగునీటి అవసరాలకే రిజర్వాయర్లలోని నిల్వలు
ఆగస్టు దాకా ఆగుదాం... ఇన్‌ఫ్లోలు వస్తే సాగునీటి విడుదలపై నిర్ణయం
వానలు పడకపోతే వరి వేయొద్దు...ఆరుతడి పంటలు వేసుకోవాలి
నిజాంసాగర్‌లో నిల్వలున్నా సాగుకు ఇవ్వొద్దు
గోదావరి, కృష్ణా బేసిన్లలోని నిల్వలన్నీ తాగునీటికే
స్కీవమ్ కమిటీలో నిర్ణయం లైవ్ స్టోరేజీ వివరాలు లేకుండా వచ్చిన అధికారులపై మండిపాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజర్వాయర్లలో ఉన్న నిల్వలన్నీ కూడా తాగునీటి అవసరాలు తీర్చడానికే వినియోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టుల కింద సాగునీటిని విడుదల చేస్తామనే ప్రకటనలు అధికారులు చేయరాదని స్కీవమ్ (రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ..ఇది రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల నుంచి పంటలకు నీటిని విడుదల చేయడంపై తుది నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారిక యంత్రాంగం) ఆదేశించింది. బుధవారం ఈఎన్సీ (జనరల్) రమేష్‌బాబు అధ్యక్షతన కమిటీ సమావేశం జలసౌధలో జరిగింది. ఈ సమావేశంలో ఏయే ప్రాజెక్టుల్లో ఏ మేర లైవ్ స్టోరేజీ ఉందనే అంశంపై చర్చ జరిగింది. అయితే లైవ్ స్టోరేజీ వివరాలు లేకుండా సమావేశానికి హాజరుకావడంపై కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కాడా) అధికారులను ఈఎన్సీ మందలించారు. ఏ రిజర్వాయర్లో ఏమేరకు లైవ్ స్టోరేజీ ఉందనే వివరాలు లేకుండానే వస్తారా? ఇది పద్ధతి కాదంటూ కాడా అధికారులపై మండిపడ్డారు. వచ్చే నెలలో మళ్లీ సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోపు ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు వస్తే సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ఇక రిజర్వాయర్లో కనీస నీటిమట్టం కింద చుక్కనీటిని కూడా సాగునీటి అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టం పైన 27 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 14 టీఎంసీల నిల్వలున్నాయని గుర్తించారు. ఈ నిల్వలన్నీ ప్రస్తుతానికి తాగునీటి అవసరాలకే వినియోగించాలని గుర్తు చేశారు. ప్రస్తుతానికి భూగర్భ జలాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో వానలు పడక పోతే మరింత లోతుకు నీళ్లు వెళ్లే అవ కాశాలున్నాయని, రైతాంగం ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరి సాగుకు ఉపక్రమించరాదని భూగర్భజలశాఖ డైరెక్టర్ గుర్తు చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో అరుతడి పంటలే వేసుకోవాలని రైతులను కోరుతున్నామని వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ నర్సింహారావు తెలిపారు.
ఇక మూసీ ప్రాజెక్టులో నిరంతరం నిల్వలు ఉంటున్నందున ఈ ప్రాజెక్టుకింద సాగునీటికి నీరందించాలని, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ వరదలతో తాలిపేరు ప్రాజెక్టుకు వరద నిరంతరం వస్తుందని, ఆ ప్రాజెక్టు కింద సాగునీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్‌లో 513 అడుగుల మేర నీరుందని, ఈ ప్రాజెక్టు నుంచి ప్రతినెల 13 టీఎంసీలు తాగునీటికి అవసరం ఉంటుందని తెలిపారు. 510 అడుగుల కిందికి నిల్వలు చేరితే అత్యవసర పరిస్థితుల్లో పంపింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. ఇక నిజాంసాగర్‌లో ఆశాజనకంగానే నిల్వలు ఉన్నప్పటికీ ఆ నిల్వలను సాగునీటికి ఇవ్వొద్దని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఈఎన్సీ (అడ్మిన్) టి.శ్రీనివాస్, ఈఎన్సీ(ఓ అండ్ ఎం) మధుసూదన్‌రావుతో పాటు ప్రాజెక్టుల టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలు హాజరయ్యారు.


