వేములవాడ: ఎప్పుడూ బిజీగా ఉండే వేములవాడ రాజన్న ఆలయం ఎదుటి వీధి ఆషాఢం మొదలుకావడంతో సైలెంట్ అయిపోయింది. నిత్యం భక్తుల రద్దీతో వ్యాపారసంస్థలు సందడిగా ఉండేది. కానీ ప్రస్తుతం పలు వ్యాపారసంస్థలు మూసివేసి కనిపిస్తున్నాయి. ఆషాఢంలో రాజన్న దర్శనానికి భక్తులు తక్కువగా వస్తుంటారు. దీంతో రాజన్న ఆలయం ఎదుట ఉన్న వ్యాపారులు తమ వ్యాపారాలకు సెలవు పెడతారు. ఈ పక్షం రోజుల్లో తమకు నచ్చిన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తుంటారు. పూజా సామగ్రి, టోపీలు, జనరల్‌స్టోర్స్, కొబ్బరికాయలు, బెల్లం, కుంకుమ, హోటళ్లు, లాడ్జీలు, బట్టల వ్యాపారులు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
సంఘటితంగా ప్రయాణాలు
ఒకరో ఇద్దరో కాదు.. ఇక్కడి వ్యాపారులు బ్యాచ్‌లుగా ఏర్పడతారు. ఒకే వీధిలోని వ్యాపారులు కలిసి పక్షం రోజులకు పైగా లాంగ్‌టూర్లు ప్లాన్ చేసుకుంటారు. అయ్యప్ప, కాశీ, రామేశ్వరం, తిరుపతి పుణ్యక్షేత్రాలతోపాటు ఊటి, కేరళ, కులుమనాలి వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇందుకోసం నెల రోజుల ముందే బుకింగ్స్, ప్లానింగ్స్ జరిగిపోతాయి. మానసిక ఉల్లాసంతోపాటు రానున్న శ్రావణమాసం రద్దీకి సరికొత్త ఉత్సాహంతో సిద్ధమవుతుంటారు.
ఏడాది పొడవునా వచ్చే భక్తులకు అవసరమైన వస్తువులను దుకాణంలో అందుబాటులో ఉంచుతాం. పండగలు, సెలవు రోజుల్లో తీరిక ఉండదు. ఆషాఢంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దుకాణాలు మూసివేసి వ్యాపార కుటుంబాలతో కలిసి యాత్రలకు వెళ్తాం. దీని ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
– తమ్మిశెట్టి అర్జున్, బొమ్మల దుకాణం, వేములవాడ
రోజువారీ వ్యాపార ఒత్తిడిలో ఒకరినొకరు పలకరించుకునే తీ రిక ఉండదు. కానీ ఈ ఆషాఢం టూర్లతో అందరం కలిసి ప్ర యాణిస్తాం. ఒకే దగ్గర వండుకుని తింటాం. ఈ పదిహేను రోజులు వ్యాపారాలు బంద్ చేసి ఇలా వెళ్లి.. నూ తన ఉత్సాహంతో తిరిగి వస్తాం. శ్రావణ మాసం నాటికి కొత్త ఉత్సాహంతో షాపులు తెరుస్తాం.
– సాయి, హోటల్ నిర్వాహకుడు, వేములవాడ
రాజన్న సన్నిధిలో ఆషాఢ విరామం దొరకడంతో ఏటా యాత్రలకు వెళ్తాం. జిల్లాలోనే ఈ సంప్రదాయం వేములవాడలో ప్రత్యేకం. కొంతమంది దుకాణాలను సర్దుకోవడం, రినోవేషన్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. మేమంతా ఏటా పోచమ్మకు బోనాలు తీస్తాం.
– పిన్నింటి హన్మండ్లు,
రాజరాజేశ్వర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు
కొత్త ప్రదేశాల సందర్శనలో వ్యాపారులు బిజీ
బృందాలుగా విహారయాత్రలకు..
మూతబడ్డ వ్యాపార సంస్థలు
సైలెంట్ అయిన గుడి వీధులు
నూతనోత్సాహంతో శ్రావణమాసానికి సిద్ధం


