ఫెర్టిలైజర్‌సిటీ/రామగుండం సరదాగా క్రికెట్ ఆడుతున్న విద్యార్థుల్లో ఒకరు క్రికెట్ బాల్‌కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్‌లోని రామగుండం మోడల్ స్కూల్‌లో బుధవారం సాయంత్రం ఈఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లింగాపూర్ మోడల్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి వెంచర్ల సాత్విక్(13) స్నేహితులతో కలిసి పాఠశాల మైదానాంలో క్రికెట్ ఆడుతున్నాడు. బాల్ ప్రహరీ బయటపడడంతో సాత్విక్‌తోపాటు మరో విద్యార్థి శ్రీకర్ వెతుకుతూ ముందుకు సాగారు. సమీపంలోని బావిలో కనిపించిన బాల్ కోసం ఒకరికొకరు చేతులు పట్టుకొని దానిని తీసేందుకు యత్నించారు. ఈ క్రమంలో సాత్విక్ చేయి జారి అందులో పడిపోయాడు. మరోవిద్యార్థి ఒక్కసారిగా కేకలు వేయడంతో పీఈటీ శ్రీనివాస్ వెంటనే అక్కడకు చేరుకొని శ్రీకర్‌ను బయటకు లాగారు. సాత్విక్ అప్పటికే నీటిలో మునిగిపోయాడు. స్థానికులు వచ్చి సాత్విక్‌ను బయట తీయగా అప్పటికే మృతిచెందాడు.
ప్రిన్సిపాల్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌కు సస్పెన్షన్‌కు ఉత్తర్వులు
విద్యార్థి మృతి విషయాన్ని నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీల నేతలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్(పీఈటీ)ను బాధ్యత వహించి, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. చివరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌తో మాట్లాడారు. బాధ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో ప్రిన్సిపాల్ పంబాల సదానందం, వైస్ ప్రిన్సిపాల్ జె.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబంలో ఒకరికి పాఠశాలలో ఒప్పంద కార్మికుడిగా అవకాశం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.
అక్కతో కలిసి రోజూ బడికి..
వెంచర్ల సాత్విక్ ఎనిమిది, అక్క శ్రీవైష్ణవి పదో తరగతి లింగాపూర్ మోడల్ స్కూల్‌లో చదువుతున్నారు. తల్లిదండ్రులు ఎన్టీపీసీలో కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతున్నారు. ఎన్టీపీసీ సమీపంలోని ఖాజీపల్లి స్వగ్రామం. అక్కతో కలిసి రోజూ బడికి వచ్చే సాత్విక్ మృతితో పాఠశాలతోపాటు స్వగ్రామంలోనూ విషాదం అలముకుంది.
క్రికెట్‌బాల్ కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి
వ్యవసాయ బావిలోపడి విద్యార్థి దుర్మరణం
లింగాపూర్ మోడల్ స్కూల్ సమీపంలో ఘటన


